YS_Jagan_High_Courtవైసీపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో రోడ్లపై రోడ్ షోలు, సభలు నిర్వహించుకోవడాన్ని నిషేదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నం:1పై హైకోర్టు ఈరోజు స్టే విధించింది.

ఈ జీవోపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవో పేరుతో ప్రతిపక్షాల గొంతు నొక్కుతోందని, షరతుల పేరుతో సభలు, సమావేశాలు పెట్టుకొనీయకుండా అడ్డుపడుతోందని పిటిషన్‌ ద్వారా హైకోర్టు దృష్టికి తీసుకువెళ్ళారు. రాజకీయ పార్టీలకి సభలు, సమావేశాలు నిర్వహించుకోవడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో రాజ్యాంగ విరుద్దంగా ఉన్నందున దానిని రద్దు చేయాలని రామకృష్ణ హైకోర్టుకి విజ్ఞప్తి చేశారు.

ఆ పిటిషన్‌పై నేడు విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఈ జీవోని జనవరి 23వరకు సస్పెండ్ చేస్తున్నట్లు మద్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణని ఈనెల 20కి వాయిదా వేస్తూ ఆలోగా ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయవలసిందిగా ఆదేశించింది.

చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా కందుకూరులో రోడ్ షో నిర్వహిస్తున్నప్పుడు త్రోక్కిసలాటలు జరిగి 8 మంది మరణించారు. వారి కుటుంబాలకు టిడిపి భారీగా నష్టపరిహారం చెల్లించడమే కాకుండా చంద్రబాబు నాయుడు స్వయంగా బాధిత కుటుంబాల ఇళ్ళకి వెళ్ళి పరామర్శించారు. ఆ తర్వాత మళ్ళీ గుంటూరు జిల్లా ఉయ్యూరులో ప్రవాస భారతీయుడు శ్రీనివాస్ అధ్వర్యంలో చంద్రబాబు నాయుడు సంక్రాంతి కానుకలు ప్రజలకి పంపిణీ చేస్తున్నప్పుడు తొక్కిసలాటలు జరిగి ముగ్గురు వ్యక్తులు చనిపోయారు.

ఈ రెండు ఘటనల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ జీవో నం:1 జారీ చేసింది. అది మళ్ళీ అటువంటి విషాద ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకే అని చెపుతున్నప్పటికీ, షరతుల పేరుతో రాష్ట్రంలో ప్రతిపక్షాలు సభలు, సమావేశాలు నిర్వహించలేని పరిస్థితులు కల్పించింది. అందుకే ప్రతిపక్షాలు దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ హైకోర్టుని ఆశ్రయిస్తే న్యాయస్థానం కూడా ఆ జీవోని తప్పు పడుతూ స్టే విధించింది. ఈ జీవోని గట్టిగా సమర్ధించుకొంటున్న మంత్రులకి హైకోర్టు తాజా ఉత్తర్వులు చెంపదెబ్బ వంటిదే అని చెప్పవచ్చు. జీవోనూయి హైకోర్టు ఈ నెల 23వరకు నిలిపివేసింది కనుక అప్పటి వరకు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ సభలు, రోడ్ షోలకు ఎటువంటి ఆటంకాలు ఉండవు.