High Court Shocks KCR on Dharna Chowk Shiftingఇందిరా పార్కులోని ధర్నా చౌక్ ను నగర శివార్లకు తరలించాలని ప్రయత్నించిన కేసీఆర్ ప్రభుత్వానికి హైదరాబాద్ హై కోర్టు అడ్డుకట్ట వేసింది. దశాబ్దాలుగా ఉన్న ఇందిరా పార్కులోనే ధర్నా చౌక్ ను అనుమతివ్వాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుందని దానిని కాలరాసే అధికారం ప్రభుత్వాలకు ఉండదని కోర్టు అభిప్రాయపడింది.

నగర మధ్యలో ఉన్న ఇందిరా పార్కు కాకుండా దూరంగా ఉండే నగర శివారులో ధర్నా చౌక్ కేటాయిస్తే అక్కడకు మనుషులను తరలించడం కష్టమని, అలాగే మీడియా కవరేజ్ కూడా తగ్గుతుందని ప్రభుత్వం అలోచించి ఈ మార్పు చేసిందని విపక్షాల అభిప్రాయం. గతంలో ప్రతిపక్షంలో ఉండగా ధర్నా చౌక్ ను బాగా వాడుకుని ఇప్పుడు అధికారంలోకి వచ్చాకా దానిని లేకుండా చేద్దామని ప్రభుత్వం ప్రయత్నిస్తుందని వారి ఆరోపణ.

నగర మధ్యలో ధర్నా చౌక్ వల్ల చుట్టు పక్కల నివాసం ఉండేవారికి బాగా ఇబ్బంది కలుగుతుంది అనే నెపంతో ప్రభుత్వం ధర్నా చౌక్ మార్చాలనే నిర్ణయం తీసుకుంది. సుదీర్ఘ న్యాయపోరాటం తరువాత తీర్పు ప్రతిపక్షాలకు అనుకూలంగా వచ్చింది. ఎన్నికల ముంగిట ఈ తీర్పు ప్రభుత్వానికి చెంప పెట్టు అని రాబోతున్న మార్పుకు ఇది శుభసూచకమని వారు భావిస్తున్నారు.