high court serious on jagan government about gpf moneyఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వోద్యోగుల జీపీఎఫ్ ఖాతాలో నుంచి రూ.800 కోట్లు మాయం అవడంపై హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వానికి డబ్బు అవసరమైతే ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలో నుంచి తీసుకొని వాడేసుకొంటుందా?అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

గెజిటెడ్ ఉద్యోగుల సంఘం నేత కృష్ణయ్య దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు శుక్రవారం విచారణ జరిపినప్పుడు, ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ హాజరయ్యి సంజాయషీ ఈయవలసి ఉండగా, కింద స్థాయి అధికారి చేత అఫిడవిట్‌ దాఖలు చేయించింది. దీనిపై కూడా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సమయాభావం వలన ప్రభుత్వం తరపున దిగువ స్థాయి అధికారిని పంపించిందని తదుపరి విచారణకు ప్రిన్సిపాల్ సెక్రెటరీ స్వయంగా హాజరై అఫిడవిట్ దాఖలు చేస్తారని ప్రభుత్వం తరపు న్యాయవాది హామీ ఇచ్చారు.

సాంకేతిక తప్పిదం వలననే ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలో నుంచి సొమ్ము వెనక్కు వచ్చేసిందని ప్రభుత్వం తరపున హాజరైన అధికారి వివరణ ఇవ్వగా, ఇలాంటి కుంటిసాకులు చెపితే ఓ ఛార్టెడ్ అకౌంటెంట్‌ను అడ్వకేట్ జనరల్‌గా నియమించాల్సి వస్తుందని హెచ్చరించింది. ప్రభుత్వానికి డబ్బు అవసరమై ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలో నుంచి సొమ్ము వెనక్కు తీసుకొన్నట్లు హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. కనుక ఈ కేసులో ఎవరు అఫిడవిట్ దాఖలు చేసిన ఈ కేసులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బాధ్యులు అవుతారని గుర్తుంచుకోవాలని హైకోర్టు హెచ్చరించింది.

ఇంతకీ ఉద్యోగుల సొమ్మును ఎప్పటిలోగా వాపసు చేస్తారో తెలియజేస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ ఈ కేసు తదుపరి విచారణను ఆగస్ట్ 3వ తేదీకి వాయిదా వేసింది.

ఒకవైపు దొరికిన చోటల్లా ఇష్టం వచ్చినట్లు అప్పులు చేస్తూ, ప్రభుత్వ భూములను అమ్మేసుకొంటున్నా ఇంకా జగన్ ప్రభుత్వానికి డబ్బు సరిపోవడం లేదంటే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. చివరికి తమ జీపీఎఫ్ ఖాతాలో నుంచి రూ.800 కోట్లు తీసి వాడేసుకోవడం ఇంకా దారుణమని ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.