high court serious on Chandrababu naidu Visakhapatnam incidentమాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నం పర్యటనను అడ్డుకుని అధికార పార్టీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా తాను విశాఖలో పర్యటించాల్సిందేనన్న యోచనలో చంద్రబాబు ఉండటంతో…. త్వరలోనే ఆయన వైజాగ్ పర్యటన ఖరారు కానుందని పార్టీ వర్గాలు అంటున్నాయి.

అంతకంటే ముందు చంద్రబాబు పర్యటనను వైఎస్సార్ కాంగ్రెస్ అడ్డుకోవడంపై టీడీపీ నేతలు గవర్నర్ కు ఫిర్యాదు చెయ్యాలనే ఆలోచనతో ఉన్న ప్రతిపక్ష పార్టీ ఈరోజు హైకోర్టుని ఆశ్రయించారు. లంచ్‌మోషన్ పిటిషన్ ను విచారించిన హైకోర్టు పోలీసుల మీద తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

షరతులతో కూడిన అనుమతి ఇచ్చిన తర్వాత 151 కింద నోటీసులు ఎందుకు ఇచ్చారని హైకోర్టు ప్రశ్నించింది. “ముందస్తు అరెస్ట్‌ చేయాల్సింది రాళ్లు, కోడిగుడ్లు వేయడానికి వచ్చిన వాళ్లని కదా?. ఆందోళనకారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?. ఎయిర్‌పోర్టుకు రాకుండా వాళ్లని ఎందుకు నిలువరించలేకపోయారు..?” అని హైకోర్టు ఒకింత సీరియస్ అయ్యింది.

ఈ వ్యవహారం మీద పూర్తి స్థాయిలో అఫిడవిట్ దాఖలు చెయ్యాలని డీజీపీ, విశాఖ సీపీని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 2కు వాయిదా వేశారు. ఆరోజున పూర్తి పోలీసు భద్రత మధ్య చంద్రబాబు విశాఖపట్నం పర్యటనకు సహకరించాల్సిందిగా కోర్టు ఆదేశించే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు.