High Court questions Telangana Govt on land allocation to Director N Shankar-తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కారణంగా గత ఏడాది సినీ దర్శకుడు ఎన్‌.శంకర్‌కు రంగారెడ్డి జిల్లా మోకిల్లాలో కోట్లు విలువచేసే ఐదు ఎకరాల భూమిని ఎకరం రూ.5 లక్షల చొప్పున కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ లెక్కన ఐదు ఎకరాలు కేటాయించారు. కోట్లు విలువచేసే భూమిని కేవలం రూ.25 లక్షలకు కట్టబెట్టడాన్ని తప్పుపడుతూ హైకోర్టులో ప్రజాహిత పిటిషన్‌ దాఖలైంది.

ఈ కేసు విషయమై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. సినీ దర్శకుడు ఎన్‌.శంకర్‌కు ఏ ప్రాతిపదికన కేటాయించారో చెప్పాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రభుత్వం తరపున హాజరైన న్యాయవాది కేబినెట్ నిర్ణయం మెరుపు కేటాయించారని కోర్టుకు విన్నవించారు. అయితే దానిని కూడా కోర్టు తప్పుపట్టింది.

“కేబినెట్‌ నిర్ణయానికి కూడా ఓ ప్రాతిపదిక ఉండాలి కదా!. భూకేటాయింపులు ఓ పద్ధతిలో జరగాలని సుప్రీం పేర్కొన్నా.. ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదని..’’ హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఏజీ క్వారంటైన్‌లో ఉన్నందున ప్రభుత్వ న్యాయవాది కోర్టును గడువు కావాలని కోరడంతో.. కోర్టు తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది.

ఇప్పటివరకు టాలీవుడ్ లో ఉన్న స్టూడియోలు అన్నీ ఆంధ్ర నేపథ్యం ఉన్న వారివే. దానితో తెలంగాణకు చెందిన శంకర్ భూమి కేటాయించి స్టూడియో కట్టిస్తే… తెలంగాణకు సినీ పరిశ్రమలో ఏదో చేసినట్టు ఉంటుందని ప్రభుత్వం ఆలోచన చేసింది. అయితే ఇప్పుడు అది ఇబ్బందిలో పడే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది.