High Court Of Andhra Pradeshసీఆర్డీఏ రద్దు, రాజధాని తరలింపు అంశాల పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. సీఆర్డీఏ రద్దు, మూడు రాజధానుల బిల్లులు ఏ స్థాయి లో ఉన్నాయని ప్రభుత్వం తరపున హాజరైన అడ్వకేట్ జనరల్ ని అడిగింది. బిల్లులు అసెంబ్లీలో పాస్ అయ్యాయని, మండలి సెలెక్ట్ కమిటికి పంపించిందని చెప్పుకొచ్చారు.

ఈ సమయంలో కోర్టు విచారణ చెయ్యదగింది కాదని ఆయన చెప్పడంతో కోర్టు కూడా అంగీకరించింది. రైతులకు తమ సమస్యలు తెలియజేయడానికి హైకోర్టు సమయమిచ్చినా… అంతలోపే సభలో ప్రభుత్వం బిల్లు ఎందుకు పెట్టిందని ధర్మాసనం ప్రశ్నించింది. బిల్లు చట్టంగా మారడానికి.. కనీసం నెలరోజుల సమయం ఉండటంతో వచ్చేనెల 24కు వాయిదా పడింది.

కోర్టులు విచారణ మొదలు పెట్టకపోతే ప్రభుత్వ కార్యాలయాలను ప్రభుత్వం విశాఖపట్నానికి తరలిస్తుందని రైతుల తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. బిల్లు చట్టంగా మారకుండా, కోర్టులో విచారణ పూర్తి కాకుండా ఏవైనా విభాగాలను ప్రభుత్వం తరలిస్తే.. దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని కోర్టు చెప్పింది.

అలాగే దాని ఖర్చును వ్యక్తిగత ఖాతాల నుంచి జమ చేయాల్సి ఉంటుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. నిన్న మండలిలో పరిణామాల దగ్గర నుండి నేటి హైకోర్టు తీర్పు వరకూ వరసగా ఎదురుదెబ్బలు తగలడం ప్రభుత్వం పెద్దలు జీర్ణించుకోలేకపోతున్నారు.