ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సకాలంలో జీతాలు చెల్లించడంలేదని, తమ జీపీఎఫ్ ఖాతాలలో నిధులు తీసి వాడేసుకొంటోందని ప్రభుత్వోద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమ బిల్లుల బకాయిలు చెల్లించడంలేదంటూ కాంట్రాక్టర్లు హైకోర్టులో కేసులు వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ నిధులను పక్కదారి పట్టించేస్తోందని ఆరోపిస్తూ రాష్ట్ర పంచాయతీ పరిషత్ ఉపాధ్యక్షుడు రామకృష్ణారెడ్డి మరికొందరు కొన్ని రోజుల క్రితం హైకోర్టులో ప్రజాహిత పిటిషన్ వేశారు.
15,16 ఆర్ధిక సంఘం రాష్ట్రంలోని పంచాయతీలకి రూ.7,659 కోట్లు నిధులు విడుదల చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం వాటిని విద్యుత్ బిల్లులు బకాయిల సర్దుబాటు కోసం మళ్లించిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులని రాష్ట్ర ప్రభుత్వం తీసేసుకొంటుండటంతో పంచాయతీల పరిధిలో అభివృద్ధి పనులు నిలిచిపోతున్నాయని పేర్కొన్నారు.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్.జయసూర్యలతో కూడిన ధర్మాసనం దీనిపై బుదవారం విచారణ చేపట్టినప్పుడు, న్యాయమూర్తులు ప్రభుత్వ వైఖరిని తప్పు పట్టారు. ఒక ఖాతాలో సొమ్ముని వేరే ఖాతాలకి మళ్ళించడం మళ్ళీ జమా చేస్తుండటం రాష్ట్ర ప్రభుత్వానికి దురాలవాటుగా మారిపోయిందని అన్నారు. నిధులు మళ్ళింపుపై సంజాయిషీ ఇస్తూ కౌంటర్ దాఖలు చేయాలని గతంలోనే తాము ఆదేశించామని కానీ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలని కూడా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్ళీ కౌంటర్ దాఖలు చేయదనైకి ప్రభుత్వానికి మరో నాలుగు వారాలు గడువు ఇస్తున్నామని, ఆలోగా దాఖలు చేయకపోతే తగిన ఆదేశాలు జారీ చేయవలసివస్తుందని హెచ్చరిస్తూ ఈ కేసు తదుపరి విచారణని నాలుగు వారాలకి వాయిదా వేశారు.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులని పంచాయతీల విద్యుత్ బిల్లుల సర్దుబాటు కోసమని పక్కదారి పట్టించినప్పుడు విద్యుత్ బకాయిలు చెల్లించి ఉండాలి. కానీ విద్యుత్ బకాయిలు పెరిగిపోయాయని చెపుతూ విద్యుత్ శాఖ అధికారులు తరచూ గ్రామ, మండల స్థాయిలో ప్రభుత్వ కార్యాలయాలకు, పాఠశాలల ఫ్యూజులు పీకి పట్టుకుపోతున్నట్లు పత్రికలలో వార్తలు వస్తూనే ఉన్నాయి. మరయితే పంచాయతీలకి వచ్చిన నిధులని ప్రభుత్వం దేనికోసం వాడుకొంటున్నట్లు?