MLA Madhusudhan-Reddy - MLA Roja - MLA Rajini- Vidadalaఆంధ్రప్రదేశ్ లో పోలీసులు అధికార పార్టీ ఎమ్మెల్యేల లాక్ డౌన్ ఉల్లంఘనలకు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఇప్పటికే పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిబంధనలను నిత్యావసరాల పంపిణీ పేరుతో ఉల్లఘించినా పట్టించుకోని పోలీసులు ప్రతిపక్ష నేతల మీద మాత్రం కేసులు పెడుతున్నారు. టీడీపీ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ మీద ఇప్పటికే ఈ రకమైన కేసులు పెట్టారు.

ఇప్పుడు అధికార పార్టీ విషయంలో హైకోర్టు కలగజేసుకుంది. కరోనా వ్యాప్తికి వైసీపీ నేతలే కారణమంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. లాక్‌డౌన్‌ సమయంలో వైసీపీ నేతలు నిబంధనలు అతిక్రమించారని వేసిన పిటిషన్‌పై ఈరోజు హై కోర్టు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారించింది. ఈ నేపథ్యంలో ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలకు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి, నగరి ఎమ్మెల్యే రోజా, నెల్లూరు జిల్లా కిలివేటి సంజీవయ్య, పలమనేరు ఎమ్మెల్యే వెంకటగౌడ, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజినికి ఈ నోటీసులు ఇచ్చింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఏం చర్యలు తీసుకున్నారో వారంలోగా కౌంటర్‌ దాఖలు చేయాలని డీజీపీ, ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.

ఈ విషయంలో వీడియో రుజువులు పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి గనుక పోలీసులకు, ప్రభుత్వానికి ఈ విషయంలో అక్షింతలు పడే అవకాశం ఉంది. వీరి గురించి జాతీయ మీడియాలో కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉండగా… ఆంధ్రప్రదేశ్ లో గడచిన 24 గంటలలో 67 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీనితో మొత్తం కేసులు 1,717కు చేరాయి.