high courtఏపీలో వివిద శాఖల అధికారులు కోర్టు ధిక్కార కేసులలో హైకోర్టు చుట్టూ రోజూ ప్రదక్షిణాలు చేస్తున్నారని, ఇలా అయితే ఇక ప్రభుత్వ పనులు ఎప్పుడు చేస్తారని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ప్రశ్నించడం వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోంది. ప్రస్తుతం వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న గోపాలకృష్ణ ద్వివేది గతంలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసేవారు. ఆయన ఒక్కరి మీదే 70 కోర్టు ధిక్కారణ కేసులున్నాయని ప్రభుత్వ న్యాయవాదే హైకోర్టుకి చెప్పుకోవలసి వచ్చింది. మరో ఐఏఎస్ అధికారిపై కూడా 60-70 కోర్టు ధిక్కారణ కేసులున్నాయని తెలపగా, “మరయితే ప్రభుత్వ పనులు ఎప్పుడు చేస్తారు?” అని జస్టిస్ బట్టు దేవానంద్ ప్రశ్నించారు.

ప్రతీరోజూ కోర్టులో ఐఏఎస్ అధికారులని చూస్తుండటం మాకూ చాలా ఇబ్బందిగానే ఉందని అన్నారు. అయితే ఏదైనా ఓ అంశంపై హైకోర్టులో కేసు దాఖలైనప్పుడు కోర్టు ఇచ్చిన ఆదేశాలని అమలుచేయకుండా, పదేపదే కోర్టు ధిక్కరణ పాల్పడుతూ నోటీసులు అందుకొన్న తర్వాతే ఎందుకు తప్పులు సరిదిద్దుకొంటున్నారని ప్రశ్నించారు. ఇదే పని మొదటే చేసి ఉంటే మీకూ, మాకూ ఇంత సమయం వృదా అయ్యేది కాదు కదా? అని ప్రశ్నించారు. దేశంలో అత్యధిక కోర్టు ధిక్కరణ కేసులు ఏపీలోనే నమోదవుతున్నాయని జస్టిస్ బట్టు దేవానంద్ అన్నారు.

ప్రకాశం జిల్లాలో తుర్లుపాడు మండలంలోని తాడివారి పల్లె గ్రామానికి చెందిన కంచర్ల కాసయ్య 2016లో ఉపాధి హామీ పధకంలో భాగంగా రహదారి నిర్మాణ పనుల కోసం గ్రావెల్ సరఫరా చేస్తే 2022 వరకు ప్రభుత్వం ఆయన బిల్లులు చెల్లించలేదు. ఆరేళ్లపాటు ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరిగితిరిగి వేసారిపోయిన ఆయన గత ఏడాది పిటిషన్‌ వేశారు. దానిపై హైకోర్టు వెంటనే స్పందిస్తూ నాలుగు వారాలలోగా ఆయన బిల్లులు చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కానీ హైకోర్టు ఆదేశాలని అధికారులు పట్టించుకోకపోవడంతో ఆయన మళ్ళీ హైకోర్టుని ఆశ్రయించారు. దాంతో కోర్టు ధిక్కారనేరం కింద హైకోర్టు గోపాలకృష్ణ ద్వివేది, ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్ఎస్ రావత్, ప్రకాశం జిల్లా కలెక్టర్‌ ఏ.దినేష్ కుమార్‌ తదితరులకి నోటీసులు జారీ చేయగా వారందరూ శుక్రవారం హైకోర్టులో విచారణకి హాజరయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్ బట్టు దేవానంద్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇకనైనా అధికారులు పని తీరు మార్చుకోవాలని లేకుంటే ఇకపై మొదటిసారి కోర్టు ధిక్కారకేసు విచారణలోనే కటినమైన తీర్పు వెలువరించవలసివస్తుందని తీవ్రంగా హెచ్చరించారు.