High Court Halts Polavaram Project Worksఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం పనులకు మరోసారి బ్రేక్ పడింది. పోలవరం హైడల్‌ ప్రాజెక్ట్‌ పనులు నిలిపివేయాలంటూ హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశించింది. మాజీ కాంట్రాక్టర్ నవయుగ పిటిషన్‌పై కోర్టు ఈరోజు విచారించింది. ప్రతివాదులకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.

ప్రభుత్వం తరపున వాదించిన అడ్వకేట్ జనరల్ పనులు ఆపేస్తే, ప్రాజెక్టు మూడు నెలల పాటు ఆలస్యం అవుతుందని కోర్టు దృష్టికి తెచ్చినా, కోర్టు అందుకు ఒప్పుకోలేదు. 10-15 రోజులు పనులు ఆగడం వల్ల వచ్చిన నష్టం ఏమీ లేదు అని అభిప్రాయపడింది. పోలవరం హైడల్‌ ప్రాజెక్ట్‌ పనులు నిలిపివేయాలంటూ ఆదేశించింది.

మంగళవారం తమ ముందుకు రావాల్సిందిగా ఏపీజెన్కో కు ఆదేశాలు ఇచ్చింది. మొన్న ఆ మధ్య ప్రభుత్వం అభ్యర్ధన మేరకు హైకోర్టు సింగల్ జడ్జ్ బెంచ్ ప్రాజెక్టు పనుల మీద స్టే తొలగించింది. రివర్స్ టెండరింగ్ లో ప్రాజెక్టు పనులు చేజిక్కించుకున్న మేఘా సంస్థ ఈ వారమే భూమి పూజ చేసి అక్కడకు యంత్రాలను తరలించడం మొదలు పెట్టింది.

ఈలోగా మళ్ళీ పనులకు బ్రేక్ పడింది. తమ కాంట్రాక్టు రద్దు చెయ్యడానికి ఎటువంటి సహేతుకత లేదని, భూమి తమకు అప్పగించకపోవడం వల్లే పనులు ఆలస్యం అయ్యాయని నవయుగ కోర్టుకు వెళ్ళింది. ఇది తమకు ఏపీజెన్కో కు మధ్య జరిగిన ఒప్పందమని, రాష్ట్రప్రభుత్వం కేవలం థర్డ్ పార్టీ మాత్రమే అని. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఏపీజెన్కో మీద ఒత్తిడి తెచ్చి కాంట్రాక్టు రద్దు చేయించిందని నవయుగ ఆరోపణ.