Andhra Pradesh High Court - YS Jaganసుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజల అవసరాలు తెలుసు అంటారు… ఒక్కో మంత్రికి అరడజన్ సలహాదారులు ఉన్నట్టుగా ఉన్నారు. అయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కొన్ని చిన్ని చిన్న విషయాలు కూడా కోర్టులు చెప్పాల్సి రావడం శోచనీయం. వివరాల్లోకి వెళ్తే… విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ భూములను ఇళ్ల పట్టాలకు ప్రభుత్వం కేటాయించింది.

ఈ వ్యవహారంపై హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. ఈ పిటిషన్‌పై విచారించిన హైకోర్టు.. ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టివేసింది. రాష్ట్రంలో ఎక్కడా విద్యా సంస్థల భూములు ఇళ్ల పట్టాలకు ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలకు సంబంధించిన స్థలాల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వొద్దని ఆదేశాల్లో పేర్కొంది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలకు సంబంధించిన స్థలాలను వాటి అవసరాలకే వాడాలి అనేది కనీసం జ్ఞానం. ఇది ఎవరికైనా మామూలుగానే అర్ధం కావాలి. ప్రభుత్వానికి అయితే ఆ స్పృహ ముందే ఉండాలి.

ఆ విషయాన్ని కూడా కోర్టులతో మొట్టికాయలు వేయించుకుని చెప్పించుకోవడం ఏంటో? తప్పు తమ దగ్గర పెట్టుకుని ఆ తరువాత కోర్టులను నిందిస్తారు. మరోవైపు ఈ విషయంగా దానిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హై కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను 8 వారాలకు వాయిదా వేసింది.