High Court allowed EX Minister Narayana can be questioned at his residence రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉన్నంత కాలం ఎవరూ ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు. కానీ ఎప్పుడైతే రాజకీయాలలో ప్రతీకార రాజకీయాలు మొదలయ్యాయో అప్పటి నుంచి రాజకీయాలలో ఉన్నత స్థాయి నుంచి గల్లీ స్థాయి నాయకుడు వరకు ఏదో ఓ రోజు ఆ ప్రతీకార రాజకీయాలకు మూల్యం చెల్లించక తప్పడం లేదు. కనుక రాజకీయాలలోకి రావాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయిప్పుడు. నిజానికి కొంతమంది పేరు ప్రతిష్టల కోసం, కొంతమంది పదవులు, అధికార దాహంతో మరికొందరు తమ కేసుల నుంచి రక్షణ పొందడానికొ లేదా ఆస్తులను కాపాడుకోవడానికో రాజకీయాలలోకి వస్తుంటారు. అటువంటివారిలో మాజీ మంత్రి నారాయణ కూడా ఒకరు.

నారాయణా విద్యాసంస్థల ద్వారా భారీగా ఆస్తిపాస్తులు, సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదించుకొన్నాక రాజకీయాలలో చేరి గుర్తింపు సంపాదించుకోవాలనుకొన్నారు. అలాగే సంపాదించుకొన్నారు కూడా. అయితే ఆయన మంత్రిగా ఉన్నప్పుడు తీసుకొన్న కొన్ని నిర్ణయాలు ఇప్పుడు ఆయన మెడకి చుట్టుకొన్నాయి.

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు మాస్టర్ ప్లానులో అవకతవకలు జరిగాయంటూ ఏపీ సిఐడీ పోలీసులు ఆయనకు సెక్షన్ 160 కింద నోటీస్ ఇచ్చారు. ఆ కేసులో విచారణకు సాక్షిగా రావాలని ఆదేశించారు. ఈ వ్యవహారంలో ఆయన అవినీతికి పాల్పడ్డారా లేదా?అనేది న్యాయస్థానం తెలుస్తుంది. అయితే జగన్‌ ప్రభుత్వం టిడిపి ముఖ్య నేతలందరినీ టార్గెట్ చేస్తున్నందున నారాయణని వేదించేందుకే ఈ కేసు విచారణ పేరుతో నోటీస్ పంపి ఉండవచ్చని టిడిపి నేతలు భావిస్తున్నారు.

ఈ నోటీసుపై నారాయణ తరపున న్యాయవాది హైకోర్టులో పిటిషన్‌ వేసారు. ప్రస్తుతం ఆయన శాస్త్ర చికిత్స చేయించుకొని ఇంట్లో నుంచి కదలలేని పరిస్థితిలో ఉన్నందున సిఐడీ పోలీసులు హైదరాబాద్‌లోని ఆయన ఇంట్లోనే ప్రశ్నించాలని పిటిషన్‌ ద్వారా కోరారు. హైకోర్టు అందుకు అనుమతిస్తూ, నారాయణ న్యాయవాది సమక్షంలో ఆయన నివాసంలో ప్రశ్నించవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది.

ఇది వైసీపీ ప్రభుత్వానికి కాస్త నిరాశ కలిగించే విషయమే అని చెప్పవచ్చు. నిజానికి దాని ఉద్దేశ్యం ఈ వ్యవహారంలో జరిగిన అవినీతి లేదా అవకతవకలను కనిపెట్టడం కాదని విచారణ పేరుతో ఆయనపై మానసికంగా, శారీరికంగా ఒత్తిడికి గురిచేయడమే అనేది బహిరంగ రహస్యమే. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజుని విచారణ పేరుతో పోలీసులు హింసించడమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అందుకే అప్పటి నుంచి ఆయన ఏపీ పోలీసులకు చిక్కకుండా ఢిల్లీలోనే ఉండిపోయారు. కానీ రాజకీయాలలో ఈ కక్ష సాధింపు చర్యలు, ప్రతీకార రాజకీయాలను ఎంతగా పెంచి పోషిస్తే దానికి అందరూ అంతగా మూల్యం చెల్లించక తప్పదని గ్రహిస్తే మంచిది.