Maa-Movie-Press-Meet---Tollywood-Heroines-Controversy‘టాలీవుడ్ నుండి కోట్లు తీసుకుంటున్న హీరోయిన్లు, తెలుగు సినీ వేడుకలకు మాత్రం రావడం లేదనేది’ స్వయంగా దర్శకరత్న దాసరి నారాయణరావు వ్యక్తపరిచిన ఆవేదన. దీనికి కౌంటర్ గా రామ్ చరణ్ అండ్ కో కొన్ని వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత జరిగిన రచ్చ తెలియనిది కాదు. ఆ రచ్చను పక్కన పెడితే, నాడు దాసరి వ్యక్తపరిచిన భావాలే నేడు ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా కూడా వెలిబుచ్చారు. ‘మా’ భవన నిర్మాణంలో సహకరించాల్సిందిగా హీరోయిన్లను అడుగుతుంటే, ఎవరూ ముందుకు రావడం లేదంటూ ఆవేదన వ్యక్తపరిచారు.

తెలుగు సినీ పరిశ్రమ అక్కున చేర్చుకుని ఆదరించిన హీరోయిన్లు నిర్మాతల నుండి కోట్లకు కోట్లు పారితోషికాలుగా తీసుకుంటున్నారని, వారిని భవన నిర్మాణం కోసం సహకరించాలని బ్రతిమాలుతున్నామని, ఇద్దరు, ముగ్గురు కో-ఆపరేట్ చేస్తున్నారని, కొందరేమో మేనేజర్ల పైకి తోసేస్తున్నారని, మేనేజర్లతో కూడా సంప్రదింపులు చేస్తున్నామని, ప్రాబ్లంస్ వచ్చినపుడు మాత్రం ఓ చేత్తో సబ్ స్క్రిప్షన్, మరో చేత్తో ఫిర్యాదును తీసుకువస్తారని, లక్ష రూపాయల సబ్ స్క్రిప్షన్ అయితే 20 లక్షల చెక్ బౌన్సు కేసుతో వస్తారంటూ మండిపడ్డారు.

అయితే ఇక నుండి అలాంటి వారిని పట్టించుకోబోమని, మేము 30 ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉంటున్నామని, కనుక దయచేసి హీరోయిన్లు కో-ఆపరేట్ చేస్తే భవన నిర్మాణంలో వారి ఫోటో కూడా పెట్టుకుంటామని, కార్యక్రమాలకు వస్తే వాళ్ళు అడిగినంత కాకపోయినా, ఎంతో కొంత మేము ఇస్తామని అన్న శివాజీరాజా, అలా కాకుండా తోక జాడిస్తే, నిర్దాక్షిణ్యంగా కట్ చేస్తామని, మాకు సహకరించని హీరోయిన్లు తెలుగు ఇండస్ట్రీకి కూడా అవసరం లేదంటూ కుండబద్దలు కొడుతూ చెప్పారు. తమ నేతృత్వంలో ఎలాగైనా భవన నిర్మాణం జరిగి తీరాలనే సంకల్పంతో ‘మా’ పనిచేస్తున్నట్లుగా కనపడుతోంది.