Sivaji On Operation Dravidaశుక్రవారం సాయంత్రం నాడు హీరో శివాజీ వెల్లడించిన ‘ఆపరేషన్ గరుడ’ అంశం రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించింది. దీనిపై ఒక్కో పార్టీ ఒక్కో విధంగా స్పందించగా… ‘తన దగ్గర ఉన్న సమాచారాన్ని తెలిపాను, మీరు ఎలా స్పందిస్తారో, ఏం చేస్తారో, మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం’ అంటూ హీరో శివాజీ ఓ న్యూస్ ఛానల్ చేపట్టిన చర్చలో మరోసారి స్పష్టం చేసారు. బిజెపిని ఉద్దేశించి చేసిన ఈ ‘ఆపరేషన్ ద్రవిడ’లో వాస్తవం ఎంత ఉందో గానీ, వర్తమాన రాజకీయాలు శివాజీ చేసిన ఆరోపణలను బలపరిచేలా ఉండడంతో, ఈ అంశం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది.

నిజంగా బిజెపి ఈ ఆపరేషన్ చేస్తోందో లేదో బిజెపి వర్గాలకు, శివాజీకే తెలియాలి గానీ, ఈ అంశం బట్టబయలు కావడం వలన ‘ఆపరేషన్ ద్రవిడ’ కార్యరూపం సిద్ధించుకునే అవకాశాలు మాత్రం సన్నగిల్లాయి. ఎందుకంటే రాజకీయాల్లో చెప్పింది ఏది జరగదు, ఎప్పుడూ ప్లాన్ – ఎ, ప్లాన్ – బి, ప్లాన్ – సిలతో పొలిటికల్ పార్టీలు సిద్ధంగా ఉంటాయి. శివాజీ చెప్పినట్లు ఈ ఆపరేషన్ నిజమే అయితే, అది ప్లాన్ – ఎ అయితే గనుక, అది ఇంకా కొనసాగే అవకాశం లేదు. బహిర్గతం అయిన అంశాన్ని ఏ రాజకీయ పార్టీ కూడా అనుసరించదు.

ఈ విధంగా బిజెపికి ‘మాస్టర్ స్ట్రోక్’ను ఇవ్వడంలో శివాజీ సక్సెస్ సాధించాడని చెప్పవచ్చు. ఒకవేళ ఇదంతా శివాజీ ‘కల్పిత గాధ’ అని అనుకున్నా, రాష్ట్రంలో ఉన్న మూడు ప్రాంతీయ పార్టీలకు వచ్చిన నష్టమేమి లేదు. అది కూడా బిజెపికి ఇచ్చిన ‘మాస్టర్ స్ట్రోక్’గానే పరిగణించాల్సి ఉంటుంది. శివాజీ చెప్పిన అంశాలకు ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయాలకు సారూప్యత ఉండడమే, ఈ ‘ఆపరేషన్ ద్రవిడ’కు అత్యంత ప్రాధాన్యత దక్కేలా చేసింది. తాము బిజెపిపై బాంబు విసరబోతున్నానని ముందుగానే చెప్పి చేసిన శివాజీ, చాలా డేరింగ్ గానే ఈ స్టెప్ తీసుకున్నారని చెప్పాలి.