sivaji-pawan-kalyan-bjpఏపీకి దక్కాల్సిన ‘స్పెషల్ స్టేటస్’ అంశంపై ‘ప్రత్యేక హోదా సాధన సమాఖ్య’ అధ్యక్షుడు, సినీ నటుడు శివాజీ కొన్నాళ్ళుగా పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శివాజీ అనేకమార్లు బిజెపి నేతలను ఒక రేంజ్ లో విమర్శలు చేసిన వైనం అందరికీ విదితమే. అయితే ఒకానొక సమయంలో శివాజీపై ఎదురుదాడి చేసిన సమయంలో… నాలుక కోస్తా అంటూ తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

తాజాగా ఇదే ఉదంతాన్ని శివాజీ ప్రస్తావిస్తూ… “హోదా కోసం తాను మాట్లాడితే ఓ ఎంపీ త‌న‌ను నాలుక కోస్తాన‌ని హెచ్చ‌రించార‌ని, మ‌రి ‘జ‌న‌సేన’ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా హోదా కోసం గ‌ళ‌మెత్తితే ఆయ‌న‌ను నాలుక కోస్తా అని ఎందుకు అన‌లేదని” శివాజీ ప్ర‌శ్నించారు. అభిమానులు, ప్ర‌జ‌లు తిర‌గ‌బ‌డ‌తార‌ని భ‌య‌ప‌డుతున్నారా? మ‌నిషిని బ‌ట్టి ఎంపీలు ఆచితూచి మాట్లాడుతున్నారని, ఎంత‌కాలం ప్ర‌జ‌ల‌ని మోసం చేస్తారని, మ‌నం ఎందుకు భ‌య‌ప‌డాలి? అని శివాజీ ప్రశ్నల వర్షం కురిపించారు.

ప‌వ‌న్ క‌ల్యాణ్ అనే వ్య‌క్తికి హోదా తీసుకొచ్చే స‌త్తా ఉందని, ప్ర‌జ‌లు న‌మ్మిన వ్య‌క్తి ప‌వ‌న్ అని, ప్ర‌త్యేక ప‌రిస్థితుల్లో ప్ర‌జ‌లు పవన్ కు మ‌ద్ద‌తుగా నిలుస్తార‌ని అన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో నిరుద్యోగుల ప‌రిస్థితి దారుణంగా ఉందని, ఎన్నో ప‌రిశ్ర‌మ‌లు వ‌స్తున్నాయంటున్నారు, ఏవేవో మాట‌లు చెబుతున్నార‌ని, అప్పుడ‌పప్పుడు కేంద్రం బిక్ష‌మేస్తోందని శివాజీ మండిపడ్డారు. ఇచ్చింది తీసుకోవాల‌నే ధోర‌ణి వ‌ద్దని సూచించిన శివాజీ, త‌న‌కు రాజ‌కీయాలు చేసే ఉద్దేశం లేదని, ఆంధ్ర‌ ప్రాంతానికి న్యాయం మాత్రం చేయాల‌ని ఉంద‌ని అన్నారు.

ప‌వ‌న్ కల్యాణ్ ‘జ‌నసేన’ పెట్టుకున్నారు… ఎన్టీఆర్ ‘తెలుగుదేశం’ పెట్టుకున్నారు… అలాగే శివాజీ ‘ఏపీ ప్రత్యేక హోదా సాధన సమాఖ్య’ పెట్టుకున్నార‌ని… త‌న‌పై విమ‌ర్శ‌లు గుప్పించ‌మేంట‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పోల‌వ‌రం అంటూ తృప్తిప‌డుతున్నారు… నిజంగా పోల‌వ‌రం అంత ఈజీగా పూర్త‌వుతుందా? భూసేక‌రణ ఇంకా జ‌ర‌గాల్సి ఉంది. అలాగే ప‌లు న్యాయపరమైన విషయాలు అడ్డు త‌గులుతున్నాయి. చ‌ట్ట స‌వ‌ర‌ణ‌కు ఎంత స‌మ‌యం ప‌డుతుంది? అని ప్రశ్నించిన శివాజీ, ప్ర‌త్యేక హోదాతోనే రాష్ట్రానికి న్యాయం జ‌రుగుతుంద‌ని, దాని కోసం అంద‌రూ క‌లిసి పోరాడాల్సిందేన‌ని, తాము పోరాటాన్ని ఆప‌బోమ‌ని, రాజ‌కీయాలు చేయ‌డం లేద‌ని పేర్కొన్నారు.