Nikhil comments on modi‘స్వామి రారా, కార్తికేయ’ వంటి చిత్రాలతో టాలీవుడ్ లో ఎదుగుతున్న యువ హీరో నిఖిల్ ట్విట్టర్ వేదికగా ఏకంగా నరేంద్ర మోడీనే ప్రశ్నించారు. అయితే ఇదేదో ఆయన సినిమా లబ్ధి కోసమో వేసిన ప్రశ్నలు కాదు, నిత్యం ప్రజలు అనుభవిస్తున్న ఓ సామాజిక అంశంపై ప్రశ్నిస్తూ… తనకు వివరణ ఇవ్వాల్సిందిగా నరేంద్ర మోడీని కోరారు.

2002లో ఒక బేరల్ క్రూడ్ ఆయిల్ ధర 37 డాలర్స్ ఉండగా, ఇండియాలో అదే సమయంలో ఒక లీటరుకు 28 రూపాయిలు ధర ఉందని, 2016లో అదో ఒక బేరల్ క్రూడ్ ఆయిల్ ధర 37 డాలర్స్ ఉండగా, ఇండియాలో మాత్రం ఒక లీటరుకు 66 రూపాయలు వుంది? దీనిని వివరించగలరా? అని మోడీకి ట్వీట్ చేసారు.

క్రూడ్ ఆయిల్ ధర ఒకటే అయినపుడు పెట్రోల్ ధరలలో వ్యత్యాసమేమిటి? రిఫైనింగ్ కాస్ట్, లేబర్ చార్జీలు పెరిగాయి అనుకున్నప్పటికీ ఈ ధర మరీ అధ్వానమని నిఖిల్ అభిప్రాయ పడ్డారు. క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిన ప్రతిసారి పెట్రోల్ ధరలు పెంచుతున్నారని, కానీ క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినపుడు మాత్రం పెట్రోల్ ధరలు తగ్గించడం లేదని, ప్రభుత్వం, ఆయిల్ కంపెనీలు కలిసి ప్రజలను దోచుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేసారు.

యుఎస్ఏలో 1 గ్యాలన్ ధర 2 డాలర్లు, అదే ఇండియన్ కరెన్సీలో షుమారు 132 రూపాయలు. 1 గ్యాలన్ 3.78 లీటర్లకు సమానం. ఆ లెక్కన ఒక్కో లీటర్ దాదాపుగా 34.92 రూపాయలు మాత్రమే! మరి ఇండియాలో 66 రూపాయలు ఎందుకు? అంటూ ట్విట్టర్ వేదికగా నిఖిల్ చేసిన ప్రశ్నలకు మంచి స్పందన వచ్చింది.