Hero Navdeep Rave Partyమంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో నవదీప్ పలు సందర్భాల్లో మద్యం సేవించి పట్టుబడటంతో పాటు అమ్మాయిలతో కలిసి షికారు చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన ఉదంతాలు చాలా ఉన్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లా మోమిన్ పేట్ మండలం చక్రంపల్లిలోని తన ఫాంహౌస్ లో నవదీప్ రేవ్ పార్టీ ఏర్పాటు చేసాడని సమాచారం అందుకున్న పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి దాడి చేశారు.

నవదీప్ ఆహ్వానాన్ని మన్నించి అక్కడికి వెళ్లిన పలువురు సినీ ప్రముఖులు మద్యం సేవిస్తూ డ్యాన్సర్లతో హంగామా చేసినట్లుగా తెలుస్తోంది. అయితే పోలీసుల రాకను గమనించిన వెంటనే వారంతా తలో దారిలో పరుగులు తీసి తప్పించుకున్నారు. అయితే నవదీప్ మేనేజర్ మాత్రం పోలీసులకు పట్టుబడిపోయాడు. దీంతో వాస్తవాలు ఏమిటన్నది మేనేజర్ ద్వారా చెప్పించే ప్రయత్నంలో పోలీసులు ఉన్నట్లు సమాచారం. పార్టీ జరిగిన ప్రాంతంలో సోదాలు చేసిన పోలీసులు పెద్ద మొత్తంలో విదేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

దీంతో ఈ వ్యవహారం టాలీవుడ్ లోనే కాక తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటనపై ట్విట్టర్ లో వివరణ ఇచ్చుకున్న నవదీప్… “ఫాంహౌస్ లో తన కుటుంబ సభ్యులతో కలిసి పార్టీ చేసుకున్నానని, అక్కడ ఎలాంటి రేవ్ పార్టీ జరగలేదని” అన్నారు. ఇక, పోలీసుల తరపు నుండి అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. అయితే నవదీప్ కున్న ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ల రీత్యా పార్టీపై పలువురు సినీ వర్గీయులు సందేహాలు వ్యక్తపరుస్తున్నారు.