Mahesh Babu with Trivikram Srinivas and Teamసూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న “సర్కార్ వారి పాట” ఏప్రిల్ 1వ తేదీన విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇంకా 45 రోజుల షూటింగ్ మిగిలి ఉందన్న వార్తలతో ఈ సినిమా రిలీజ్ పై ఇటీవల సందేహాలు నెలకొనగా, ఏది ఏమైనప్పటికీ ఏప్రిల్ 1వ తేదీకి రావడం పక్కా అన్న వార్తలతో సూపర్ స్టార్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

అలాగే మహేష్ తదుపరి సినిమాపై కూడా పలు పుకార్లు షికారు చేసాయి. ‘సర్కార్ వారి పాట’ తర్వాత త్రివిక్రమ్ తో మహేష్ ఓ సినిమా చేయాల్సి ఉండగా, ఈ సినిమాను పక్కనపెట్టి నేరుగా రాజమౌళి సినిమా కోసం షెడ్యూల్స్ ఇచ్చేశారని, దీంతో త్రివిక్రమ్ సినిమా రద్దయ్యిందన్న టాక్ సోషల్ మీడియా వేదికగా భగ్గుమంది.

ఈ వార్తలపై ఎవరూ స్పందించలేదు గానీ, తాజాగా సూపర్ స్టార్ వేసిన ఓ ట్వీట్ బదులిచ్చినట్లయ్యింది. ఈ రోజు మధ్యాహ్నం మంచి వర్క్ జరిగిందని డైరెక్టర్ త్రివిక్రమ్, నిర్మాత వంశీ మరియు లేటెస్ట్ మ్యూజికల్ సెన్సేషన్ థమన్ లు ఉన్న ఫోటోను పోస్ట్ చేసారు. దీంతో ‘సర్కార్ వారి పాట’ తదుపరి సినిమా గ్రౌండ్ వర్క్ జరుగుతుందని చెప్పకనే చెప్పారు.

ఈ పిక్ లో మహేష్ లుక్ కాస్త డిఫరెంట్ గా కనపడుతోంది. స్టైలిష్ గాగుల్స్ తో పాటు హెయిర్ స్టైల్ డిఫరెంట్ గా ఉండడం సూపర్ స్టార్ కు పెద్దగా సూట్ అయినట్టు లేదు. త్రివిక్రమ్ చేయబోయే సినిమాకు సంబంధించిన లుక్ అయితే కాదు గానీ, సాధారణ పిక్స్ లో సైతం తన అందంతో ఫిదా చేసే మహేష్, ఈ సారి మాత్రం ఈ వెరైటీ లుక్ అంతగా నప్పినట్టు లేదు.

దీంతో చాలాకాలం తర్వాత మహేష్ ఇచ్చిన ఓ పిక్ అభిమానులకే నచ్చలేదు. అందరి హీరోల అభిమానుల కంటే, తన ఫ్యాన్స్ కాస్త డిఫరెంట్, ఏదైనా బాగోకపోతే ముందు వీళ్ళే చెప్పేస్తారని మహేష్ చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా గుర్తుకు వస్తున్నాయి. బాలయ్య ‘అన్ స్టాపబుల్’లో పిక్స్ అదిరిపోయాయి అన్న అభిమానులే నేడు ఈ పిక్ పై పెదవి విరుస్తున్నారు.