hero-aadi-praises-jr-ntr-nannaku-prematho-movieఏ సినిమా అయినా హిట్ అవాలంటే… మంచి సబ్జెక్టుతో పాటు ప్రతి అంశం కలిసి రావాలని సాయికుమార్ తనయుడు హీరో ఆది అన్నాడు. దీంతో పాటు, సినిమా రిలీజ్ చేసే టైమ్, టాలెంట్ తో పాటు లక్ ఖచ్చితంగా ఉండి, మంచి సబ్జెక్టుతో పాటు రిలీజ్ డేట్ కుదిరి, అలాగే ఆ టైంలో జనం మూడ్ కూడా బాగుంటే చిత్రం విజయవంతమవుతుందని.., అయితే, మంచి చిత్రాలను ప్రజలెప్పుడు మిస్ చేయరు… అంటూ ఆది ఒక సినిమా విజయం సాధించడం పట్ల తన అభిప్రాయాలను చెప్పుకొచ్చారు.

ఇటీవల చూసిన సినిమాల్లో ‘ఊపిరి’ బాగా నచ్చిన చిత్రమని చెప్పిన ఆది, ‘క్షణం,’ ‘నాన్నకు ప్రేమతో’ చిత్రాలు కూడా బాగున్నాయని చెప్పారు. ఒక పెద్ద మాస్ హీరో అయిన జూనియర్ ఎన్టీఆర్ నుండి ‘నాన్నకు ప్రేమతో’ వంటి సినిమాను అస్సలు ఊహించలేదని, ముఖ్యంగా ఇటువంటి చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ చేయడమనేది గొప్ప విషయమంటూ ప్రశంసలు కురిపించారు.

‘మా కుటుంబాన్ని పోషించింది డబ్బింగే. డబ్బింగ్ చెప్పడమనేది తనకు ఆసక్తే’ అన్న హీరో ఆది, తనను మొదటి సినిమాతోనే ప్రేక్షకులు హీరోగా ఒప్పుకున్నారని, అందుకే, డబ్బింగ్ గురించిన ఆలోచన తాను చేయలేదని అన్నాడు. డబ్బింగ్ అంటే అంతా ఈజీ అనుకున్నావా? మొదటి సినిమాలో నీ క్యారెక్టరైనా డబ్బింగ్ చెబుతావా? అంటూ నాన్న ప్రశ్నించేవారని, మొత్తానికి ఎంజాయ్ చేస్తూ మొదటి సినిమాలో నా డబ్బింగ్ చెప్పేశాను… అంటూ గత అనుభవాలను గుర్తు చేసుకున్నారు.

తన అభీష్టాల గురించి ప్రస్తావించిన ఆది, టెన్నిస్ అంటే ఇష్టమని, గోళ్లు కొరుక్కుంటూ టెన్నిస్ మ్యాచ్ లను చూస్తుండే వాడినని, ఇంట్లో ఉన్నప్పుడు సినిమాలు చూస్తానని, ముఖ్యంగా వీడియో గేమ్ లంటే తనకు చాలా ఇష్టమని, ఇప్పటికి కూడా ఆడుతుంటానని చెప్పుకొచ్చాడు. అలాగే వారానికొకసారైనా హైదరాబాద్ బిర్యానీ తినాల్సిందేనని, ప్రయాణాల విషయానికొస్తే, విదేశీయానాలంటే తనకు ఇష్టమని.. ముఖ్యంగా చల్లగా ఉండే ప్రదేశాలకు వెళ్లడాన్ని తాను ఇష్టపడతానని చెప్పాడు.