Hemamalini sadnessహాలీవుడ్ సినిమాలలో హీరోయిన్లను ఎంత ‘బోల్డ్’గా చూపిస్తారో… అంత శక్తివంతమైన పాత్రలను కూడా తీర్చిదిద్దుతారు. అలాగే వయసుతో నిమిత్తం లేకుండా హీరోయిన్లకు అత్యధిక ప్రాధాన్యత గల పాత్రలు హాలీవుడ్ సినిమాలలో దర్శనమిస్తూ ఉంటాయి. అదే పధ్ధతి బాలీవుడ్ లోనూ రావాలంటోంది ఒకప్పటి యువతరం అందాల భామ అభిమానులంతా ముద్దుగా పిలుచుకునే ‘డ్రీం గర్ల్’ హేమమాలిని.

“హాలీవుడ్ కు చెందిన నాటి తరం నటులు ఇప్పటికీ మంచి పాత్రల్లో నటిస్తూనే ఉన్నారని, ఆ పద్ధతి బాలీవుడ్ సినిమాల్లో కూడా రావాలని” హేమమాలిని అభిప్రాయపడ్డారు. “తాను ఇప్పటివరకు దాదాపు 150 సినిమాల్లో నటించానని, ఇంకా మంచి మంచి పాత్రల్లో నటించాలనే తపన ఉందని, అయితే బాలీవుడ్ లోని అలనాటి నటులకు ఇప్పుడు మంచి అవకాశాలు రావట్లేదని” ఆవేదన వ్యక్తం చేసారు.

సినిమా నిర్మాణం భారీ బడ్జెట్ తో ముడిపడి ఉంటోంది కనుక తనలాంటి పాత తరం నటులకు అవకాశాలు ఇవ్వడం రిస్క్ గా భావిస్తున్నారని తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. 2011లో ‘అరక్షణ్’ సినిమాలో ఓ అతిథి పాత్రలో చివరగా వెండితెరపై కనిపించింది. అప్పటి నుండి సిల్వర్ స్క్రీన్ కు దూరమైనా హేమమాలిని తాజాగా ‘సిమ్లా మిర్చి’లో నటిస్తోంది.