Helicopter Vijayawada Srisailam, Helicopter Hyderabad Srisailam, Helicopter Hyderabad Srisailam Tirupati, Helicopter Vijayawada Srisailam Tirupati Serviceరాష్ట్ర విభజన తర్వాత టూరిజంకు ఏపీ సర్కార్ మిక్కిలి ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి పలు సందర్భాలలో స్పష్టం చేసారు. మాటలుకే కాదు, కార్యాచరణలో కూడా అడుగులు ముందుకు పడుతుండడంతో ప్రజలు హర్షిస్తున్నారు. ముఖ్యంగా ఏపీలో నిత్యం సందర్శించే జాబితాలో తిరుపతి మొదటి స్థానంలో ఉంటుంది. అలాగే తిరుపతి ఆవరణలో గల శ్రీకాళహస్తికి భక్తుల వెల్లువ కొనసాగుతుంది. ఆ తర్వాత శ్రీశైలం మల్లిఖార్జునస్వామి దర్శనం కోసం భక్తులు క్యూలు కడుతుంటారు.

ఈ మూడు దేవాలయాలను సందర్శించాలంటే సమయంతో కూడుకున్న పని. అయితే ఏపీ సర్కార్ ఒక్క రోజులో సుప్రసిద్ధ ఈ మూడు దేవాలయాలను సందర్శించే విధంగా ఏర్పాట్లు చేస్తోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. మంగళవారం నాడు సిఎం గ్రీన్ సిగ్నల్ లభించడమే తరువాయి అన్నట్లుగా ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. అయితే హెలికాఫ్టర్ లో ఈ ఏర్పాట్లు చేయడంతో పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులు ఈ సౌలభ్యాన్ని అందిపుచ్చుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన వివరాలు…

ఢిల్లీకి చెందిన ఏవియేషన్ సంస్థ సమ్మిట్, ప్రభుత్వంతో కుదుర్చుకున్న డీల్ లో భాగంగా, విజయవాడ, హైదరాబాద్ నగరాల నుంచి రోజూ శ్రీశైలం, తిరుమలకు పర్యటనలు సాగనున్నాయి. మరో రెండు మూడు రోజుల్లో ఈ సేవలు ప్రారంభం కానున్నట్టు అధికారులు తెలిపారు. ఉదయం 8 గంటలకు విజయవాడలో బయలుదేరిన హెలికాప్టర్ 8:30 కల్లా శ్రీశైలం చేరుకుంటుంది. సున్నిపెంటలోని హెలికాప్టర్ నుంచి దేవస్థానం వరకూ కారు ఏర్పాటు ఉంటుంది. గుడిలో స్వామివారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమ పూజను ప్రత్యేకంగా చేయిస్తారు. ఆపై పాతాళగంగలో బోట్ షికారు, స్థానికంగా ఉండే ప్రాంతాలను చూపుతారు.

మధ్యాహ్నం 12:30కి శ్రీశైలం నుంచి బయలుదేరే హెలికాప్టర్ 1:30కి తిరుపతి వెళుతుంది. తొలుత తిరుచానూరు పద్మావతి అమ్మవారి దేవాలయం, మంగాపురం, శ్రీకాళహస్తి చూపించి, ఆపై రాత్రికి తిరుమలలో వసతి ఏర్పాటు చేస్తారు. మరుసటి రోజు తెల్లవారుఝామున వీఐపీ బ్రేక్ దర్శనం చేయిస్తారు. తిరిగి 7:30 గంటల సమయంలో హెలికాప్టర్ విజయవాడకు బయలుదేరి గంట లోపే గమ్యానికి చేరుతుంది. ఇదే విధంగా హైదరాబాద్ నుంచి కూడా మరో ప్యాకేజీ ఉంటుంది.

ఈ మొత్తం టూర్ కు సంబంధించి ఎంత వసూలు చేయనున్నారన్న సంగతి మంగళవారం నాడు వెల్లడి కానుంది. కేవలం 24 గంటల్లోనే మూడు దేవాలయాల దర్శనం కావడంతో దీనికి ఆదరణ ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందులోనూ రాబోతున్న కాలం కార్తీక మాసం కావడంతో, పూజా కార్యక్రమాలకు భక్తులు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు గనుక, ఇది తప్పకుండా విజయవంతం అవుతుందని అంచనా.