Health care ATM‘ఏటీఎం’ అంటే ఇప్పటివరకూ డెబిట్ కార్డుతో డబ్బులను డ్రా చేసుకుంటామన్న విషయమే ఎక్కువ మందికి తెలిసిన విషయం. అలాగే మరికొన్ని ప్రాంతాల్లో డబ్బు చెల్లిస్తే, కూల్ డ్రింక్స్, తినుబండారాల ప్యాకెట్లు, మరికొన్ని చోట్ల బంగారం నాణాలు ఇచ్చే ఏటీఎంలు ఉన్నాయన్న విషయం తక్కువ మందికి తెలిసిన విషయం. అయితే ఇవి కాకుండా మరో కొత్త రకం ఏటీఎంలు ఏపీలో ప్రత్యక్షం కానున్నాయి.

రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో ప్రజల వైద్య సేవలను మరింత మెరుగు పరిచే దిశగా హెల్త్ కేర్ ఏటీఎంలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొలువు తీరనున్నాయి. మొత్తం 25 హెల్త్ కేర్ ఏటీఎంలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నెల్లూరు జిల్లాలో ఒకటి, మిగిలిన అన్ని జిల్లాల్లో రెండు చొప్పున వీటిని సత్వరమే ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసింది.

ఈ ఏటీఎం సెంటర్లలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలైన తలనొప్పి, మధుమేహం, జ్వరం వంటి రోగాలకు ఔషధాలు ఒక్క క్లిక్ తో లభిస్తాయి. వాస్తవానికి హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో హెల్త్ కేర్ ఏటీఎంలను ఏర్పాటు చేయాలని మార్చిలోనే కేంద్రం నిర్ణయించింది. వీటి ద్వారా పేదలకు ఉచితంగా మందులు ఇవ్వాలన్నది మోడీ సర్కారు నిర్ణయం. హెల్త్ వర్కర్లు, ఏఎన్ఎంల ద్వారా వీటిల్లో ఔషధాలను నింపుతారు. ఒకవేళ అత్యవసర పరిస్థితి అయినట్లయితే, ఈ ఏటీఎం మెషీన్ ద్వారానే సమీపంలోని అంబులెన్స్ కు సమాచారం ఇచ్చేందుకు కూడా వీలు కలిగేలా ఏర్పాటు చేసారు.