Hayathnagar Corporator Sama Tirumala Reddyఒకే వారంలో హైదరాబాద్ ని భారీ వర్షం ముంచెత్తింది. ఈ రెండు పర్యాయాలలో గత 100 సంవత్సరాలలో అక్టోబర్ నెలలో ఎప్పుడూ లేనంత వర్షం హైదరాబాద్ లో కురిసిందట. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యి… నిలువు నీడ తిండి లేకుండా చేశాయి… ట్రాఫిక్ జాములు… కరెంటు లేకపోవడం వంటి సమస్యలతో హైదరాబాద్ అల్లాడుతోంది.

ఇప్పటివరకు ఇటువంటి వాటిని గత ప్రభుత్వాల మీద నెట్టేసిన తెరాస ఇప్పుడు తన బాధ్యత నుండి తప్పించుకోలేకపోతుంది. ఎక్కడికక్కడ ఆ పార్టీ కార్పొరేటర్లను ప్రజలు నిలదీస్తున్నారు. హయత్‌నగర్ తెరాస‌ కార్పొరేటర్‌పై స్థానికులు దాడికి పాల్పడ్డారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న కార్పొరేటర్‌ సామ తిరుమలరెడ్డిపై స్థానికులు చేయి చేసుకున్నారు.

రంగనాయకులగుట్టలో నాలా కబ్జాకు గురవుతుందని.. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా తిరుమలరెడ్డి పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. స్థానికులతో తిరుమల్ రెడ్డి మాట్లాడుతుండగా.. వెనక నుంచి వచ్చిన ఓ మహిళ ఆయన చొక్కా లాగేందుకు ప్రయత్నించింది. నాలా గురించి ప్రశ్నిస్తూ ఆయనను ముందుకు వెళ్లకుండా అడ్డుకుంది.

తక్షణం స్పందించిన ఆయన అనుచరులు… ఆమెను అక్కడి నుంచి దూరంగా తీసుకువెళ్లి పరిస్థితి అదుపులోకి వచ్చింది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ పరిణామాలతో జీహెచ్ఎంసి ఎన్నికలు సమీపిస్తుండడంతో తెరాస నాయకులకు చెమటలు పడుతున్నాయి.