Ravi Tejaపడి లేవడం అంత సులభం కాదు. ఓ రెండు ఫ్లాపులు వస్తే చాలు ఏదో ప్రపంచం మునిగిపోయిందన్న బాధలో డిప్రెషన్ కు లోనయ్యి సంవత్సరం రెండేళ్లు గ్యాప్ తీసుకుని మరీ టైం వేస్ట్ చేసే యూత్ హీరోలు మన చుట్టే ఉన్నారు. నీ పని నువ్వు చేసుకుంటూ పో హిట్టు ఫట్టు గురించి ఆలోచించకనే సూత్రం పాటించబట్టే అప్పట్లో ఎన్టీఆర్ కృష్ణ లాంటి అగ్రజులు రోజుకు మూడు షిఫ్టులు ఇంటికెళ్ళకుండా పని చేసేవాళ్ళు. బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ ఇదే బాపతు. ఇన్నేసి తీయకురా స్వామీ అంటూ ఫ్యాన్స్ మొత్తుకున్నా సరే తన స్పీడ్ ఆపడు. ఎందుకు పోతున్నాయని విశ్లేషించుకుంటాడు తప్పించి అమాంతం బ్రేక్ తీసుకోడు.

ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే రవితేజ అచ్చం ఇదే దారిలో వెళ్తూ ఒకపక్క కౌంట్ తో పాటు ఆదాయం పెంచుకుంటూనే సరైన సమయంలో హిట్లు కొట్టి తన సత్తా ఏంటో చాటుతున్నాడు. ధమాకా మొదటి రోజు రివ్యూలు, పబ్లిక్ టాకులు ఏమంత పాజిటివ్ గా లేవు. మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి కానీ మరీ వంద కోట్ల గ్రాస్ తెచ్చే స్థాయి అవుతుందని ఎవరి కలకూ అందలేదు. కట్ చేస్తే ఖిలాడీ, రామరావు ఆన్ డ్యూటీ గాయాలు పూర్తిగా మాఫీ అయ్యేలా అదిరిపోయే విజయం జేబులో పడిపోయింది. ఇరవై రోజులు తిరిగాయో లేదో ధమాకా రన్ కొనసాగుతుండగానే వాల్తేరు వీరయ్య వచ్చేసింది.

చిరంజీవి సినిమానే అయినా ఇందులో మాస్ మహారాజా కాంట్రిబ్యూషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అతిశయోక్తి ఎంత మాత్రం కాదు. ఒకవేళ ఆ ఏసిపి పాత్రలో ఇప్పుడున్న ఏ మీడియం రేంజ్ హీరోని ఊహించుకున్నా చప్పగా అనిపిస్తుంది. రవితేజ ఎనర్జీ తాలూకు పవర్ అది. అందుకే మెగాస్టారే తను లేకపోతే ఈ స్థాయి స్పందన వచ్చేది కాదని ఒప్పేసుకున్నారు. వాల్తేరు వీరయ్యకు సైతం అదిరిపోయిందనే మాట ముందు వినిపించలేదు. స్లో పాయిజన్ లాగా జనానికి మెల్లగా ఎక్కేసి కూల్ గా బ్లాక్ బస్టర్ కొట్టేసింది.

వేగం విషయంలో మాత్రం రవితేజని అభినందించాలి. రెండు విజయాల తాలూకు ఆనందం ఇంకా పచ్చిగా ఉండగానే రావణాసుర సెట్స్ లో అడుగుపెట్టేశాడు. ఈగల్ ఆల్రెడీ సగానికి పైగా పూర్తి చేశాడు. టైగర్ నాగేశ్వరరావు కోసం రెడీ అవుతున్నాడు. ఇంకో తమిళ దర్శకుడికి ఇంకొద్ది రోజుల్లో గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నాడని టాక్ ఉంది. ఆన్ స్క్రీనే కాదు బయట కూడా మహా దూకుడుగా ఉండే రవితేజ లాగే మిగిలిన వాళ్ళు స్పీడ్ పెంచాల్సిన అవసరం చాలా ఉంది. షూటింగులు థియేటర్లు కళకళలాడితేనే కదా పరిశ్రమ పచ్చగా ఉండేది.