Kings-XI-Punjab-batsman-Hashim-Amla--Scored-104--against-Mumbai-Indians-ipl-2017198 పరుగుల భారీ స్కోర్ సాధించిన తర్వాత ఏ జట్టైనా తమదే విజయం అని భావిస్తారు. ఎందుకంటే లక్ష్య చేధనలో ఒత్తిడి మేరకు ఎక్కడో చోట వికెట్ల పతనం ప్రారంభమైతే, మ్యాచ్ తమ వైపుకు తిరుగుతుందని భావిస్తారు. నూటికి తొంభై పాళ్ళు ఇలాగే జరుగుతుంది కూడా! కానీ, ఐపీఎల్ లో గురువారం నాడు జరిగిన పంజాబ్ కింగ్స్ ఎలెవన్ – ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ మాత్రం ఇందుకు విరుద్ధంగా జరిగి, క్రికెట్ అభిమానులకు పరుగుల వరద రుచి చూపించింది.

వరుసగా అయిదవ సారి టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ కు హషిం ఆమ్లా చుక్కలు చూపించాడు. తొలుత నింపాదిగా ఆడిన ఆమ్లా, ఇన్నింగ్స్ కొనసాగుతున్న కొద్దీ తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ముఖ్యంగా మలింగ బౌలింగ్ లో సిక్సర్లు, ఫోర్లు బాదుతూ ముంబైకు ఘాటుగా సమాధానం ఇచ్చాడు. మరో ఎండ్ లో మాక్స్ వెల్ (18 బంతుల్లో 40) చెలరేగడంతో, ఆమ్లా 60 బంతుల్లో 6 సిక్సర్లు, 8 ఫోర్లతో 104 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. దీంతో ముంబై ముందు 199 పరుగుల భారీ లక్ష్యం నిలిచింది.

దీంతో మ్యాచ్ ఖచ్చితంగా పంజాబ్ వశం కావడం ఖాయమని భావించినప్పటికీ, ముంబై కాస్త పోరాటపటిమను ప్రదర్శిస్తుందేమోనని విశ్లేషించారు. అయితే తొలి ఓవర్ నుండే ముంబై బ్యాట్స్ మెన్లు పిచ్చకొట్టుడు కొట్టడం ఆరంభించారని చెప్పవచ్చు. సందీప్ శర్మ వేసిన తొలి ఓవర్ చివరి బంతిని సిక్సర్ గా మలిచిన బట్లర్ ఇన్నింగ్స్ మొదలు, 16వ ఓవర్లో మోహిత్ శర్మ వేసిన మూడవ బంతిని రానా సిక్సర్ గా మలిచి మ్యాచ్ ను విజయవంతం చేసే వరకు… అంతా హైలైట్స్ లా సాగిపోయింది.

ఓపెనర్లు పార్థీవ్ పటేల్, బట్లర్ ల ధాటికి 4వ ఓవర్లోనే ముంబై 50 పరుగుల మైలురాయిని చేరుకోగా, తొలి వికెట్ కు 5.5 ఓవర్లలో 81 పరుగులు జోడించారు. 18 బంతుల్లో 2 సిక్సర్లు, 4 ఫోర్లతో 37 పరుగులు చేసి ఔటైన పార్థీవ్ పటేల్ తర్వాత క్రీజులోకి వచ్చిన ఇన్ ఫాం బ్యాట్స్ మెన్ రానా, ఆ ‘పిచ్చకొట్టుడు’ ఒరవడిని కొనసాగించాడు. దీంతో 8వ ఓవర్లోనే 100 పరుగులు దాటగా, మ్యాచ్ పంజాబ్ నుండి దూరమవుతున్నట్లు స్పష్టమైంది. పవర్ ప్లే అన్న టాక్ లేకుండా ఆడిన 15.3 ఓవర్లు కూడా పవర్ ప్లే మాదిరే షాట్లతో విరుచుకుపడ్డారు.

బట్లర్ 37 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 77 పరుగులు చేసి అవుట్ కాగా, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్య కూడా రెండవ బంతినే సిక్సర్ గా మలిచి జట్టు ఉద్దేశాన్ని చెప్పకనే చెప్పాడు. రానా తన ఎదుర్కొన్న 34 బంతుల్లో ఒక్క బౌండరీ కూడా కొట్టలేదు గానీ, ఏకంగా 7 బంతులను సిక్సర్లుగా మలిచి 62 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ముంబై చేసిన ఈ ‘పిచ్చకొట్టుడు’ బ్యాటింగ్ తో పంజాబ్ కెప్టెన్ మాక్స్ వెల్ తో సహా ఇతర క్రీడాకారులు, షాక్ కు గురయ్యారు. మొత్తం ముంబై ఇన్నింగ్స్ లో బౌండరీలు 13 నమోదు కాగా, సిక్సర్లు మాత్రం అంతకుమించిన స్థాయిలో 15 నమోదయ్యాయి. తొలి ఓవర్ నుండే విరుచుకుపడిన బట్లర్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.