Has Janasena decided to distance itself from the BJP?బీజేపీని దూరం పెట్టాలనే జనసేన డిసైడ్ అయిపోయిందా? అంటే అవును అనే అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ అంటే నరేంద్ర మోడీకి చాలా ఇష్టమని, పవన్ కళ్యాణ్ ని రాష్ట్రానికి అధిపతిని చెయ్యాలని బీజేపీ అనుకుంటుందని సోము వీర్రాజు ఐస్ పెట్టారు. అంతకు ముందు బీజేపీ తిరుపతి అభ్యర్థిని పవన్ కళ్యాణ్ ని తీసుకెళ్లి లేడీ సెంటిమెంట్ కు కూడా ట్రై చేశారు.

అయినా తిరుపతి ఉపఎన్నికకు పవన్ కళ్యాణ్ దూరంగానే ఉండేలా ఉంది. ఉప ఎన్నికలో పోటీచేయడానికి గాను బిజెపి అభ్యర్ధి రత్నప్రభ ఈ రోజు నామినేషన్ వేశారు. ఆమె తో పాటు కేవలం బిజెపి నేతలు, కార్యకర్తలే ఉన్నారని, జనసేన పార్టీ వారు ఎవరూ లేరు. ఈ వార్త మీడియాలో ప్రముఖంగా వచ్చింది. రత్నప్రభ నామినేషన్ కార్యక్రమంలో జనసేన వారు ఎవరూ పాల్గొనకపోవడం పొత్తులో లుకలుకలకు అర్ధం పడుతుంది.

2019 ఎన్నికల్లో తిరుపతి పార్లమెంట్‌ పరిధిలో బీజేపీకి ఆరో స్థానం దక్కింది. గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్‌రావుకు 7,22,877 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి 4,94,501 ఓట్లు రాగా మూడో ప్లేస్‌లో నోటాకు 25,781 ఓట్లు వచ్చాయి. నాలుగో స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి చింతామోహన్‌కు 24,039 ఓట్లు మాత్రమే వచ్చాయి.

బీజేపీ అభ్యర్థి బొమ్మి శ్రీహరికి 16,125 ఓట్లు రాగా ఆరో స్థానంలో నిలిచారు. వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ మినహాయించి మిగిలిన రాజకీయ పార్టీలకు మాత్రం డిపాజిట్‌ కూడా రాకపోవడం విశేషం. ఈసారి డిపాజిట్ దక్కక పోతే బీజేపీని అసలు సీరియస్ గా తీసుకునే అవకాశం ఉండదు. కావున ఏదో రకంగా పవన్ కళ్యాణ్ తో ప్రచారం చేయించుకుని గౌరవప్రదమైన ఓట్లు రాబట్టాలని ఆశపడుతోంది.