Harmanpreet Kaur Women World Cup 2017 Semi-Finalఅసాధ్యం అనుకున్న విషయాన్ని టీమిండియా ఉమెన్ క్రికెటర్లు సుసాధ్యం చేసి చూపించారు. పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టును ఓడించి వరల్డ్ కప్ ఫైనల్ కు దూసుకెళ్ళడం కష్టం అని క్రీడా విశ్లేషకులు సైతం తేల్చేసిన నేపధ్యంలో… అందరి అంచనాలను తారుమారు చేస్తూ హర్మాన్ ప్రీత్ కౌర్ ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్ కు కంగారులు బెంబేలెత్తిపోయారు. దీని పర్యవసానం… ఆతిధ్య జట్టు ఇంగ్లాండ్ తో ఆదివారం నాడు జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకునేందుకు టీమిండియా సిద్ధమైంది.

తొలుత బ్యాటింగ్ చేపట్టిన టీమిండియా కట్టడి చేయడంలో ఆసీస్ బౌలర్లు సఫలమయ్యారు. తొలి 25 ఓవర్లలో మూడవ వికెట్లు కోల్పోయి కేవలం 101 పరుగులు జోడించిన టీమిండియా, 42 ఓవర్లకు 281 పరుగులు చేసిందంటే, చివరి 17 ఓవర్లలో 180 పరుగులు నమోదు చేసింది. ఇందులో తను ఎదుర్కొన్న చివరి 40 బంతుల్లో 103 పరుగులు చేసి హర్మాన్ ప్రీత్ కౌర్ ఆసీస్ బౌలర్లకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. మొత్తంగా 115 బంతులను ఎదుర్కొన్న కౌర్ 20 ఫోర్లు, 7 సిక్సర్లతో ఏకంగా 171 పరుగులతో అజేయంగా నిలిచింది.

భారీ లక్ష్య చేధనలో బరిలోకి దిగిన కంగారులు 21 పరుగులకే 3 టాపార్డర్ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆసీస్ ను విలాని (75), బ్లాక్ వెల్ (90) ఆదుకున్నారు. అయితే మరో వైపు క్రమం తప్పకుండ వికెట్లు పడిపోవడంతో 169 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి ఓటమిని ఖరారు చేసుకుంది. అయితే చివరి వికెట్ కు 76 పరుగులు జోడించిన తర్వాత బ్లాక్ వెల్ అవుట్ కావడంతో, టీమిండియా విజయం ఖరారైంది. ఒంటి చేత్తో భారత విజయానికి కారణమైన హర్మాన్ ప్రీత్ కౌర్ కు ‘ఉమెన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.