harish shankar pawan Kalyan combo ustaad bhagat singhఒకప్పుడు స్టార్ దర్శకులకు ఎన్ని సినిమాలు చేశారు వాటిలో ఎన్ని హిట్లయ్యాయి అనేదాన్ని బట్టి వాళ్ళ రేంజ్ డిసైడ్ అయ్యేది. ఉదాహరణకు దాసరి, రాఘవేంధ్రరావు, కోడి రామకృష్ణ లాంటి దిగ్గజాలు వందకు పైగా అలవోకగా చేశారంటే వాటిలో సక్సెస్ రేట్ ఎక్కువ ఉండబట్టే. కానీ ఇప్పటి డైరెక్టర్లకు అంత సీన్ ఓపికా రెండూ లేవు. రాజమౌళి అంటే ఆయన ఎంచుకునే కథలు పెట్టించే బడ్జెట్ లు లార్జర్ థాన్ లైఫ్ ఉంటాయి కాబట్టి ఎన్ని తీశారనే కౌంట్ ని మరీ సీరియస్ గా విశ్లేషించాల్సిన అవసరం లేదు. బాహుబలికి నాలుగేళ్లు తీసుకున్నా ఏడాది తర్వాత కూడా ఆర్ఆర్ఆర్ ని ప్రమోట్ చేస్తున్నా ఆయనకు మాత్రమే చెల్లింది. దానికి తగ్గట్టే గొప్ప ఫలితాలు అందుకున్నారు.

అయితే హరీష్ శంకర్ లాంటి కమర్షియల్ డైరెక్టర్ 17 ఏళ్ళ కాలంలో కేవలం ఏడు సినిమాలు చేయడమనేది ఎంత మాత్రం గర్వకారణం కాదు. అభిమానులు క్వాలిటీ అంటారేమో. డెబ్యూ మూవీ షాక్ ఆడలేదు. రామయ్యా వస్తావయ్యా మాములు డిజాస్టర్ కాదు. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ఎంటర్ టైన్మెంట్ ఫ్యాక్టర్ వల్ల దాని రేంజ్ కు తగ్గట్టు హిట్ అనిపించుకుంది కానీ మరీ భీభత్సం కాదు. దువ్వాడ జగన్నాథం వల్ల పూజా హెగ్డేకు కలిగిన మేలే ఎక్కువ. అర్జున్ జెంటిల్ మెన్ ని తిరగమోతేసి టాలీవుడ్ మాస్ స్టైల్ లో తీయాలనే ప్రయత్నం యూట్యూబ్ లో రికార్డులు సృష్టించింది కానీ గొప్పగా చెప్పుకునే స్థాయిలో బాక్సాఫీస్ వద్ద కాదు. రీమేక్ సబ్జెక్టు గద్దలకొండ గణేష్ డీసెంట్ గా గట్టెక్కింది కానీ మరీ అదరహో కాదు

ఇవి పక్కనపెడితే మిరపకాయ్ జెన్యూన్ హిట్. అందులో అనుమానం లేదు. రవితేజ ఎనర్జీని పర్ఫెక్ట్ గా వాడుకుంటూ షాక్ ఫ్లాప్ తర్వాత కూడా తనకు ఛాన్స్ ఇచ్చిన మాస్ మహారాజా నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ నిజంగానే రికార్డులు పాతరేసిన బ్లాక్ బస్టర్. దబాంగ్ రీమేక్ అయినా దాని వాసనలు ఎక్కువ లేకుండా మార్చి తీసిన తీరు సూపర్ అనిపించుకుంది. ఈ రెండే హరీష్ శంకర్ ఇంత సుదీర్ఘమైన కెరీర్ కు ఆక్సీజన్ లా పని చేశాయి. సరే పవన్ మళ్ళీ అవకాశమిచ్చాడని భవదీయుడు భగత్ సింగ్ ని కష్టపడి రాసుకుంటే తీరా నెలల తరబడి ఎదురు చూసి చూసి చివరికి తేరి మూలకథనే తీసుకుని దానికి ఉస్తాద్ అని తగిలించి కొత్త ప్రయాణం మొదలుపెట్టాడు.

ఫ్యాన్స్ లో ఇప్పటికీ దీని మీద విపరీతమైన నెగటివిటీ ఉంది. పోనీ ఇది తేరి రీమేక్ కాదని సోషల్ మీడియా వేదికగా చెప్పే అవకాశమున్నా హరీష్ శంకర్ నోరు విప్పడం లేదు. అంటే ఒప్పుకున్నట్టేగా. సో రేపు రిలీజయ్యాక ఏ మాత్రం కొత్తగా అనిపించకపోయినా చేంజ్ ని ఆడియెన్స్ పెద్దగా ఫీలవ్వకపోయినా కాటమరాయుడు ఫలితం రిపీట్ అయ్యే ప్రమాదం ఉంది. భవదీయుడు మీద ఉన్న విపరీతమైన పాజిటివ్ కార్నర్ ఈ ఉస్తాద్ వల్ల సగానికి పైగా తగ్గిపోయింది. సో ఊహించని మాస్ సర్ప్రైజ్ ఏదో చూపిస్తేనే ఈ ఉస్తాద్ భగత్ సింగ్ నెగ్గుతాడు. అసలే రామ్ ఫ్యాన్స్ తమ హీరో ట్యాగ్ ని వాడుకున్నాడని గుర్రుగా ఉన్నారు. వాళ్ళూ మాట్లాడకుండా అవుట్ ఫుట్ తో అదరగొట్టాలి. గబ్బర్ సింగ్ ఇంటర్వల్ లో పవన్ చెప్పినట్టు ఆట ఇప్పుడే మొదలైంది.