Harish Shankar - Duvvada Jagannadham‘దువ్వాడ జగన్నాధమ్’ సినిమాలోని రెండవ పాటపై బ్రాహ్మణ సంఘాలు వ్యక్తపరిచిన ఆగ్రహానికి గానూ… చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ మీడియా ముందుకు వచ్చి… తాను బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఎలా అవమానకరంగా చేస్తానంటూ వివరణ ఇచ్చుకున్నాడు. అయినా 60, 70 కోట్లు పెట్టి సినిమాలు తీసేది ఎవరిని కించపరచడానికి కాదని, తాము బ్రాహ్మనిజాన్ని హీరోయిజంగా చూపించబోతున్నామని, సదరు పాటపై ఉన్న అభ్యంతరాలను త్వరలో నివృత్తి చేస్తామని బ్రాహ్మణ సంఘాలకు విజ్ఞప్తి చేసారు.

అయితే హరీష్ శంకర్ చేసిన వ్యాఖ్యలేవి పెద్దగా వర్కౌట్ అయినట్లుగా లేవు. హరీష్ ఇంత చెప్పిన తర్వాత కూడా అఖిల భారత బ్రాహ్మణ సమాఖ్య కార్యదర్శి ఎంఎల్ఎన్ శ్రీనివాస్ మాట్లాడుతూ… ‘బ్రాహ్మణులు ఎంతో నిష్టతో పఠించే శివుడికి చెందిన నమకం, చమకాలను ఇష్టానుసారంగా పాట రూపంలో చిత్రీకరించిన దర్శకుడు హరీష్ శంకర్ తమకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని’ డిమాండ్ చేసారు. బ్రాహ్మణులను, వారి ఆచార వ్యవహారాలను వ్యంగ్యంగా తెరకెక్కించడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

నమకం, చమకం పదాలను ప్రేమగీతంలో పెట్టడం… శైవ భక్తుల మనోభావాలను దెబ్బ తీయడమేనని, ఆ సినిమా నుంచి తక్షణమే ఆ పాటను తీసివేయాలని డిమాండ్ చేశారు. ఈ ‘దువ్వాడ జగన్నాధమ్’ సినిమా నిర్మాత, దర్శకుడు, నటులపై సిటీ పోలీస్ కమిషనర్ ను కలసి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తామని విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ శ్రీనివాస్ ఈ విధంగా చెప్పారు. దీంతో హరీష్ శంకర్ చేసిన ‘మంత్రదండన’ పనిచేయలేదన్న విషయం స్పష్టమైంది. మరోవైపు ఈ పాట యూ ట్యూబ్ లో రికార్డ్ క్లిక్స్ తో దూసుకుపోతోంది.