harish rao trolls on ap government power cut issueప్రస్తుత ప్రభుత్వం మీద ఎవరు ఎలాంటి విమర్శలు చేసినా, వాటినన్నింటిని చంద్రబాబు నాయుడు మరియు ఎల్లో మీడియానే చేయిస్తున్నట్లుగా నిందలు వేయడం ‘జగన్ అండ్ కో’కు పరిపాటి. ఈ విషయంపై ఇటీవల బాగా సీరియస్ అయిన పవన్ కళ్యాణ్ ఓ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు, అయినప్పటికీ తదేకంగా నిన్న కూడా వైసీపీ వర్గాలు పవన్ ను టార్గెట్ చేస్తూ ‘బాబు స్క్రిప్ట్’ చదువుతున్నారని ఆరోపించారు.

ఇలా ప్రత్యర్థులపై ఎదురుదాడి చేస్తోన్న ‘వైసీపీ అండ్ కో’కు, తాజాగా తెలంగాణా మంత్రి నుండి ఎత్తిపొడుపు మాటలు వెలువడ్డాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రాష్ట్ర విభజన జరిగితే, తెలంగాణా అంధకారంలోకి వెళ్ళిపోతుందని నాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు, కానీ ఇపుడు ఏపీ అంధకారంలోకి వెళ్లిపోయిందని ప్రముఖ టీఆర్ఎస్ నేత హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేసారు.

ఏపీలో ఏర్పడిన పరిస్థితులు పొరుగు రాష్ట్రం వారు దెప్పి పొడవడానికి ఉపయోగపడుతున్నాయని ఏపీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితులకు కారణమైన సీఎం జగన్ మోహన్ రెడ్డిని ట్రోల్ చేస్తూ ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. నిజానికి తెలంగాణా మంత్రులు ఏపీ తీరుపై కామెంట్స్ చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో కేటీఆర్ వంటి ప్రముఖులు కూడా ఏపీలోని అంశాలను స్పృశిస్తూ, తెలంగాణా చాలా సుభిక్షంగా ఉందని కొనియాడారు.

అయితే ఈ వ్యాఖ్యలన్నీ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వెలువడుతున్నవి కావడంతో, ‘వైసీపీ అండ్ కో’ ఈ ట్రోలింగ్ కు చవిచూడాల్సి వస్తోంది. తమపై విమర్శ చేసిన ప్రతి వ్యక్తిని ‘ఎల్లో మీడియా వ్యక్తి’గా కొనియాడడం వైసీపీకి అలవాటుగా మారిపోయిన నేపధ్యంలో, హరీష్ రావు కూడా ‘ఎల్లో మీడియా వ్యక్తేనా?’ అని ప్రశ్నించడం నెటిజన్ల వంతవుతోంది. విశేషం ఏమిటంటే… తెలంగాణా మంత్రులు చేస్తోన్న కామెంట్స్ కు ఇప్పటివరకు వైసీపీ నుండి ఏ ఒక్క వ్యక్తి కూడా స్పందించలేదు.