Harish Rao Thanneeruఈరోజు తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావును కేసీఆర్ పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. హరీష్ ను తప్పించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు. పార్లమెంట్ ఎన్నికల తరువాత కేసీఆర్ కేంద్రానికి వెళ్ళి ఇక్కడ కేటీఆర్ ‘ముఖ్యమైన’ పదవి కట్టబెట్టాలని, హరీష్ ఒక్కడినే తప్పిస్తే నిరసనలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతానికి కేటీఆర్ ను కూడా తప్పించారని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. కాసేపటిక్రితం జరిగిన కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం కార్యక్రమానికి హరీష్ హాజరయ్యారు.

ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ఇప్పుడే కాకుండా ఎన్నికల ముందు కూడా చాలాసార్లు చెప్పడం జరిగిందని, టీఆర్‌ఎస్ పార్టీలో తాను క్రమశిక్షణ కలిగిన ఒక సైనికుడి లాంటి కార్యకర్తనని హరీష్ చెప్పారు. పార్టీ, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏది ఆదేశిస్తే అది తూచాతప్పకుండా అమలు చేస్తానని ఇప్పటికే పదుల సార్లు చెప్పడం జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి ఆయా ప్రాంతాలు, సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకుని కేబినెట్ ఏర్పాటు చేశారని హరీష్ రావు చెప్పుకొచ్చారు.

కేసీఆర్ తనకు ఏ బాధ్యత అప్పగించినా కూడా నిర్వర్తిస్తానని, తనకు ఎలాంటి అసంతృప్తి లేదని ఎమ్మెల్యే హరీష్ రావు స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో జరిగిన దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని ఆయన తెలిపారు. మరోవైపు గత ఎన్నికలలో తెరాస పేలవమైన ప్రదర్శన కనబరిచిన ఖమ్మం జిల్లాకు హరీష్ రావును ఇంఛార్జ్ గా చెయ్యబోతున్నారు వార్తలు వస్తున్నాయి. హరీష్ తో పాటు కేటీఆర్ కూడా ఎన్నికల ప్రచార బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.