Harish Rao Anti Chandrababu Naidu Commentsగతంలో ఓటుకు నోటు ఉదంతం జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనూహ్యంగా ఫోన్ టాపింగ్ కేసును బయటకు తెచ్చారు. దాంట్లో నిజమెంతో తెలీదుగానీ ఇరువైపుల వారు అస్త్రసన్యాసం చేసారు. ఇప్పుడు మరోసారి ఫోన్ టాపింగ్ వివాదం బయటకు వచ్చింది. నిన్న ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి హరీష్ రావు చంద్రబాబుపై ఆరోపణలు చేశారు.

తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చెయ్యడానికి చంద్రబాబు మరోసారి మహాకూటమి పేరుతో వస్తున్నారని ఆయన ఆరోపించారు. మహాకూటమి అధికారంలోకి వస్తే రెండు కీలకమైన శాఖలు కావాలని చంద్రబాబు ఇప్పటికే కండిషన్ పెట్టారని ఆరోపించారు హరీష్. ఓటుకు నోటు కేసులో ఇబ్బంది రాకుండా హోం మంత్రి పదవి అడిగారన్నారు.

అలాగే తెలంగాణాలో ఉన్న అన్ని ప్రాజెక్టులను ఆపి నీళ్లను ఆంధ్రకు తరలించుకుపోవడానికి నీటి పారుదల శాఖను అడిగారని హరీష్ ఆరోపించారు. గట్టిగా 10-15 సీట్లలో పోటీ చేసే పార్టీకి కాంగ్రెస్ ఇంతటి ప్రధానమైన శాఖలు ఇస్తుందా అంటే అనుమానమే. అది అలా ఉంచితే ఇదంతా హరీష్ కు ఎలా తెలుసు?

చంద్రబాబు ఫోన్ ను హరీష్ రావు టాప్ చేస్తున్నట్టు ఒప్పుకున్నారా? ఇప్పటికే మహాకూటమిలోని నాయకుల ఫోన్లు టాప్ చేస్తుంది ప్రభుత్వం అని కాంగ్రెస్ నేతలు ఎన్నికల కమిషన్ కు కంప్లయింట్ ఇచ్చారు. ఎన్నికల కమిషన్ దీనిపై విచారణ కూడా జరుగుతుంది. ఫోన్ టాప్ చెయ్యకుండా హరీష్ ఇన్ని వివరాలు ఎలా తెలిసినట్టు?