Harish Rao missing for 5 Years of Telangana Eventతెలంగాణ రాష్ట్ర సమితి రెండో సారి అధికారంలోకి వచ్చిన నాటి నుండి హరీష్ రావు ఏదో ఒకరకంగా వార్తలలో నిలుస్తూనే ఉన్నారు. ఆయనను మంత్రి వర్గం నుండి తప్పించి కేసీఆర్ అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు. కేటీఆర్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చెయ్యడం ద్వారా తన వారసుడు ఆయనే అని చెప్పకనే చెప్పారు. అప్పటి నుండి హరీష్ రావు పార్టీ మారతారనే వదంతులు వ్యాపించడం జరుగుతుంది. ఆయన పలుమార్లు ఖండించినా ఆ మాట వినిపిస్తూనే ఉంది.

రేపు హరీష్ రావు జన్మదినం. ఈ సందర్భంగా అభిమానులు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ట్వీట్‌ చేశారు. ఈసారి తన పుట్టినరోజునాడు వ్యక్తిగత పనుల మీద దూరంగా వెళ్తున్నానని.. హైదరాబాద్‌ లేదా సిద్దిపేటలో కార్యకర్తలకు అందుబాటులో ఉండడం లేదని ఆయన చెప్పడం గమనార్హం. ఇది పూర్తిగా ఆయన వ్యక్తిగత నిర్ణయం అయ్యి ఉండొచ్చు కాకపోతే దీనిని కూడా చాలా మంది రాజకీయ కోణంలోనే చూస్తున్నారు. ఇటీవలే తెలంగాణ భవన్ లో జరిగిన టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలకు కూడా హరీష్ హాజరు కాలేదు.

ఈరోజు హైదారాబాద్‌ పబ్లిక్‌ గార్డెన్స్‌లో జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో కూడా హరీష్ పాల్గొనలేదు. కావాలనే ఆయన తన కార్యకర్తలకు తాను పార్టీకు దూరంగానే ఉంటున్నా అనే మెస్సేజ్ ఇటువంటి పనులతో పంపుతున్నారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా రాష్ట్ర అవతరణ వేడుకల్లో సీఎం పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలో రైతులకు మరో రూ.లక్ష రుణమాఫీ చేయబోతున్నామని ప్రకటించారు.