Hari Krishna TTD Chairman TDP Politicsతెలుగుదేశం పార్టీ తనకు తగినంత గుర్తింపు ఇవ్వలేదన్న అసంతృప్తి నందమూరి హరికృష్ణకు ఉందన్న విషయం జగమెరిగిన సత్యమే. ఈ విషయంతోనే ఇరువర్గాల మధ్య బేధాభిప్రాయాలు ఏర్పడి, చివరికి అవి టిడిపి వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ గా తయారైన వైనం బహిర్గతమే. అయితే ప్రస్తుతం స్తబ్దుగా ఉన్న వాతావరణంలో… మరోసారి నందమూరి హరికృష్ణ పేరు హైలైట్ గా వినపడుతోంది. అది కూడా చంద్రబాబు తీసుకోబోయే కీలక నిర్ణయాలలో ఒకటి కావడం మరింత ప్రాధాన్యతను దక్కించుకునేలా చేసింది.

ఎందరో సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు పోటీపడే టీటీడీ బోర్డు చైర్మన్ పదవికి త్వరలో పదవి కాలం ముగుస్తుండడంతో… తదుపరి ఎవరు అన్న వెతుకులాటలలో హరికృష్ణ పేరు తెరపైకి వచ్చినట్లుగా సమాచారం. ప్రస్తుతం చైర్మన్ గా విధులు నిర్వహిస్తున్న చదలవాడ శ్రీనివాసరావు స్థానంలో ప్రతిపాదనల పేర్లల్లో హరికృష్ణ ఒకరు కాగా, నాగార్జున కన్ స్ట్రక్షన్స్ అధినేత, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ ఏవీఎస్ రాజు పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

వీరిద్దరూ కాకుండా ఆశావహుల జాబితా అయితే చాంతాడంత ఉందనుకోండి. రాజమండ్రి ఎంపీ మురళీమోహన్, నరసారావుపేట ఎంపీ రాయపాటి, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు, ఐఏఎస్ అధికారి కే.లక్ష్మీ నారాయణ, సినీ నటుడు శివాజీ… ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంది. ప్రస్తుతం పోర్చుగల్ లో సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న బాలకృష్ణ శనివారం నాడు హైదరాబాద్ కు చేరుకుంటుండగా, బాలయ్యతో చర్చించిన పిదప హరికృష్ణ నియామకంపై ఓ నిర్ణయం తీసుకుంటారనేది సమాచారం.