మధ్యతరగతి ప్రజలు సొంత ఇంటి కల నెరేవేరేలా తమ ప్రభుత్వం అతి తక్కువ ధరలకు ఖాళీ స్థలాలను అందుబాటులోకి తీసుకువస్తుందంటూ ‘జగనన్న స్మార్ట్ టౌన్ షిప్’ను ప్రారంభించిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 6 ప్రదేశాలలో ప్రారంభించిన ఈ పధకానికి ప్రజల నుండి ఆశించిన స్పందన లేదన్నది తాజా భోగట్టా.
అధికారికంగా ప్రభుత్వం అయితే ఎన్ని ప్లాట్స్ ను బుక్ చేసుకున్నారో వెల్లడించలేదు గానీ, సోషల్ మీడియాలో మాత్రం జనవరి 12వ తేదీ నాటికి 117 ప్లాట్స్ మాత్రమే బుక్ అయ్యాయని ప్రచారం జరుగుతోంది. ఇందులో ఉన్న వాస్తవం ఎంతన్నది పక్కన పెడితే, వైసీపీ సర్కార్ ఆశించిన స్థాయిలో బుకింగ్ జరగలేదని మాత్రం స్పష్టమవుతోంది.
ఎందుకంటే గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమరావతి ప్రాంతంలో ‘హ్యాపీ నెస్ట్’ పేరుతో ఫ్లాట్స్ విక్రయం పెట్టినపుడు కేవలం ఏడంటే ఏడు నిముషాలలో మొత్తం 1200 అపార్టుమెంట్లు బుక్ చేసుకున్నారు. ప్రజల నుండి వచ్చిన ఈ స్పందనను నాడు చంద్రబాబు ప్రభుత్వం ఎంతో ఘనంగా ప్రకటించుకుంది. ఏ ప్రభుత్వమైనా తమకు అనుకూలత ఉంటే ఇలాగే పబ్లిసిటీ చేసుకుంటుంది.
కానీ జగన్ సర్కార్ ఇప్పటివరకు “జగనన్న స్మార్ట్ టౌన్ షిప్” పైన ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్లాట్స్ ను విక్రయించడం ప్రారంభించి మూడు రోజులైనా ఇంకా ప్రజలకు అందుబాటులో ఉన్నాయంటే, జగన్ సర్కార్ నిర్ణయించిన ధరలు సరిగా లేవని భావించాలా? లేక జగన్ సర్కార్ పైనే ప్రజలకు నమ్మకం లేదని భావించాలా? అన్నది రాజకీయంగా చర్చనీయాంశమైంది.
ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్ళని టార్గెట్ చేస్తూ జగన్ సర్కార్ ఇచ్చిన ప్రకటనలు మధ్య తరగతి ప్రజల్లో విశ్వాసాన్ని నింపలేకపోయాయా? ఈ సంక్రాంతి పండగ ముగిసిన తరువాత అయినా ఎన్ని ప్లాట్స్ బుక్ అయ్యాయో ప్రభుత్వం నుండి ప్రకటన వస్తుందేమో చూడాలి. ఒకవేళ అప్పుడు కూడా రాని పక్షంలో ‘జగనన్న స్మార్ట్ టౌన్ షిప్’పై ప్రభుత్వం పునరాలోచించుకోవాల్సి వస్తుందేమో!?