Hair,-the-pride-of-a-woman-advertisementబంగ్లాదేశ్ కు చెందిన ఒక యాడ్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ మనసున్న వారిని కంటతడి పెట్టిస్తోంది. సామాజిక సమస్యలకు అద్దం పట్టేలా రూపొందే యాడ్స్ లో ఈ యాడ్ ను ఉత్తమమైనదిగా నెటిజన్లు కొనియాడుతున్నారు. నవ నాగరిక సమాజంలో మహిళలపై జరుగుతున్న దారుణాలను కళ్లకు కట్టేలా ఈ యాడ్ రూపొందడం విశేషం. కేవలం రెండు నిమిషాల ఒక్క సెకెను నిడివి గల ఈ యాడ్ లో… ఓ మహిళ తన స్నేహితురాళ్లతో కలిసి ఒక బ్యూటీ పార్లర్ కు ఆనందంగా వస్తుంది.

స్నేహితురాళ్లంతా ఫేషియల్, హెయిర్ కర్లింగ్ చేయించుకుంటే… ఆమె మాత్రం తన జుట్టు కత్తిరించాలని సూచిస్తుంది. ఆమె జట్టును చూసిన షాప్ కీపర్… ‘ఎంత అందమైన జట్టు’ అంటూ మెచ్చుకుంటుంది. ‘చివర్లు కత్తిరిస్తే సరిపోతుందా? మేడమ్’ అని అడుగుతుంది. ఇంకా కత్తిరించాలని ఆమె సూచిస్తుంది. దాంతో ఇంకొంచెం కత్తిరించి, ‘సరిపోతుంది కదా మేడమ్’ అని అడుగుతుంది. ‘ఇంకా కత్తిరించు’ అని ఆమె సూచిస్తుంది. దీంతో విసిగిపోయిన ఆమె… బాబ్డ్ హెయిర్ తరహాలో కాస్త మోడ్రన్ గా కత్తిరించి… ‘ఇది సరిపోతుంది మేడమ్…చాలా బాగున్నారు’ అంటూ అద్దాన్ని చూపిస్తుంది.

మిగిలిన ఆ కాస్త జుట్టును చూసిన ఆ యువతి, ఒక చేత్తో జుట్టు పట్టుకుని, ‘ఇంకా కత్తిరించండి… నా జుట్టు పట్టుకుని ఎవరూ కొట్టకుండా ఉండేంతలా కత్తిరించండి’ అంటూ కన్నీరు పెట్టుకుంటుంది. దీంతో అంత వరకు ఆమెతో వచ్చిన ఆమె స్నేహితులు ఆశ్చర్యంతో, బాధతో ఆమెను చూస్తారు… హృదయమున్న ప్రతి ఒక్కరి మనసును సూటిగా తగులుతోంది. కారణాలు ఏవైనా మహిళల అసహాయతను, నిస్సత్తువను ఈ యాడ్ సూచిస్తోంది. ఏప్రిల్ 2న పోస్ట్ అయిన ఈ యాడ్ ను 5 మిలియన్స్ వీక్షించడం విశేషం. మరి ఆ యాడ్ పై మీరూ ఓ లుక్కేయండి..!