Hackers blackmail actor Deepti Naval సైబర్ క్రైం బారినపడుతున్న బాలీవుడ్ నటీనటుల జాబితా క్రమంగా పెరుగుతూ పోతోంది. ఇటీవల సైఫ్ అలీఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్, అమృత సింగ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు హ్యాకయ్యాయి. తాజాగా, బాలీవుడ్ సీనియర్ నటి దీప్తి నావల్ కూడా హ్యాకర్ల బాధితుల లిస్టులోకి చేరిపోయారు. ఇటీవల ఆమెకు హ్యాకర్ల నుంచి మాల్‌ వేర్ స్కాముకు సంబంధించిన ఈమెయిల్ వచ్చింది.

ఆమె యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌ లను వెల్లడించిన హ్యాకర్… తాను అడిగిన మొత్తాన్ని చెల్లించకుంటే ఇంటర్నెట్ బ్రౌజింగ్ హిస్టరీ మొత్తాన్ని బయటపెడతానని బెదిరించాడు. అలా చేయకుండా ఉండాలంటే 5,600 డాలర్ల (3.9 లక్షలు)ను బిట్ కాయిన్ రూపంలో చెల్లించాలని డిమాండ్ చేశాడు. ఇందుకోసం 24 గంటల గడువు విధించాడు. ఆలోపు చెల్లించకుంటే బ్రౌజింగ్ హిస్టరీని బహిర్గతం చేస్తానని హెచ్చరించాడు.

హ్యాకర్ హెచ్చరికల నేపథ్యంలో దీప్తి పోలీసులను ఆశ్రయించారు. దర్యాప్తు జరిపిన పోలీసులు ఆ ఈమెయిల్ ‘ట్రాష్’ అని కొట్టిపడేశారు. దానిని పట్టించుకోవద్దని కోరారు. ఈ విషయం గురించి మాట్లాడేందుకు దీప్తి నిరాకరించారు. ఆ ఈమెయిల్‌ను పట్టించుకోవద్దని పోలీసులు తనకు సూచించారని తెలిపారు. కాగా, ఇటువంటి మెయిలే దాదాపు 20 మందికి వచ్చిందని పోలీసులు పేర్కొన్నారు. వారంతా తమకు ఫిర్యాదు చేశారని వివరించారు.