gvmc-garbage-collection-tax-visakhapatnamఅధికార పార్టీ అవలంబిస్తున్న ‘పన్నుల’ విధానాలపై అటు ప్రతిపక్ష పార్టీలు., ఇటు ప్రజలు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ నిరసనలోకి పారిశుధ్య కార్మికులు కూడా చేరారు. ప్రభుత్వం వేసిన ఈ చెత్త పన్ను చెల్లించడానికి ప్రజలు., షాపుల యజమానులు విముఖత వ్యక్తం చేస్తున్నారు.

పారిశుధ్య కార్మికులకు ఈ పన్ను వసూలు చేయడం “కత్తి మీద సాము”లా మారింది. ‘కరవమంటే కప్పకు కోపం… విడవమంటే పాముకు కోపం…’ అన్న నానుడిలా పన్ను చెల్లించమంటే అటు ప్రజలు నుండి., పన్ను వసూలు చేయకపోతే ఇటు ప్రభుత్వం నుండి అధికారులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. పన్ను చెల్లించని పక్షంలో చెత్త మొత్తాన్ని షాపుల ముందు పోసిన తీరుకు ప్రతిపక్షాలు, ప్రజలు అధికార ప్రభుత్వంపై ముప్పేట దాడికి దిగారు.

ఇది మా ‘ఆత్మ గౌరవాన్ని’ కించపరిచినట్లుగా భావిస్తామని ప్రజలు హెచ్చరించడంతో కాస్త వెనక్కి తగ్గిన ప్రభుత్వం, ఈ సారి తమ అధికారాన్ని పారిశుధ్య కార్మికులపై చూపింది అంటున్నారు ఉద్యోగులు. ‘కట్టిస్తారా? లేక కట్ చెయ్యాలా?’ అంటూ చెత్త పన్ను వసూలుకు సిబ్బందికి టార్గెట్లు నిర్ణయించారు ప్రభుత్వ పెద్దలు.

తాము ఇచ్చిన టార్గెట్లను పూర్తి చేయని నేపధ్యంలో సిబ్బంది జీతాల మీద ‘కోత’ విధించడం., అవసరమైతే ఆ నెల జీతాలు ‘కట్’ చేయడం జరుగుతుందని విశాఖ నగర పాలక సంస్థ, పారిశుధ్య కార్మికులకు ఒక సర్క్యూలర్ జారీ చేసింది. ఇప్పటికే ఈ సర్క్యూలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

టార్గెట్లు పూర్తి చేయలేకపోతే శానిటరీ ఇన్స్పెక్టర్ తో సహా సిబ్బంది జీతాలలో కోత ఉంటుందనే ప్రభుత్వ నిర్ణయంతో బెంబేలెత్తుతున్నారు పారిశుద్య సిబ్బంది. ప్రజలు పన్ను కట్టకపొతే తమ జీతాలు కట్ చేయడం ఏంటి? అని ప్రభుత్వంపై యుద్దానికి సిద్దమైనట్లున్నారు. ‘చెత్తా… నీ పన్నెక్కడా?’ అంటూ వీధుల చుట్టూ తిరుగుతున్నారు పారిశుధ్య కార్మికులు.