GVL Narasimha Rao - Kannaఏపీ రాజధాని అమరావతిపై బీజేపీకి స్పష్టమైన అభిప్రాయం లేదని అనిపిస్తుంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ సుజనా చౌదరి రాజధాని మార్పుని ఖండిస్తుంటే, బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు మాత్రం ప్రభుత్వానికి కొంతమేర అనుకూలమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. “రాజధాని నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. కేంద్ర ప్రభుత్వం సూచనలతో చేసేది కాదు,” అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా తమకు అభ్యంతరం లేదన్నట్టుగా మాట్లడుతున్నారు.

అమరావతిలో రాజధానిని కొనసాగించే యోచన ప్రభుత్వానికి లేదనిపిస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. బుధవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. రాజధానిని కొనసాగించకుంటే భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏంటి? అని ఈ సందర్భంగా సర్కార్‌కు ఆయన సూటి ప్రశ్న సంధించారు. రైతులను ఎలా ఆదుకుంటారో ప్రభుత్వం ఆలోచించాలన్నారు. రాజధాని తరలింపుపై గగ్గోలు పెడుతున్న టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిందేమీ లేదని జీవీఎల్‌ విమర్శలు గుప్పించారు.

ఒకపక్క పార్టీలో కొందరు నాయకులు అసలు రాజధానిని తరలించడాన్ని ఒప్పుకోము అంటుంటే జీవీఎల్ నర్సింహారావు అప్పుడే రైతులను ఎలా ఆదుకుంటారో ప్రభుత్వం ఆలోచించాలని చెప్పడం విడ్డూరం. ఇది ఆ పార్టీలోని గందరగోళాన్ని సూచిస్తుందా అనే అనుమానాలు ప్రజలకు రాకమానదు. చంద్రబాబు హయాంలో అప్పటి ప్రభుత్వాన్ని విమర్శించడంలో ఉత్సాహంగా కలిసికట్టుగా ఉన్న నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆ రకంగా ఉండలేకపోవడం గమనార్హం.