GVL Narasimha Rao -ఆంధ్రప్రదేశ్ లో గతంలో ఎప్పుడు లేని స్థాయిలో ఆలయాలపై దాడులు జరగడం ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రధానంగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ దాడుల పరంపర ప్రారంభమైంది. భక్తుల మనోభావాలు తీవ్రస్థాయిలో దెబ్బ తినేలా వరుస సంఘటనలు ఏపీలో చోటుచేసుకుంటున్నాయి.

దాడులు., సంఘటలను పరిశీలిస్తే ఉద్దేశ పూర్వకంగానే హిందూ దేవాలయాల మీద ముష్కర మూక విరుచుకుపడుతున్నారని హిందూ పరిరక్షణ సమితి ఆవేదన చెందుతుంది. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలోనే హిందువులకు అత్యంత పవిత్ర స్థలమైన బెజవాడ ఇంద్రకీలాద్రి సమీపంలో మూకుమ్మడి మత మార్పిడులు జరుగుతున్నాయని పవన్ వీడియోలతో సహా బయట పెట్టారు.

ఆ తదుపరి అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయంలో ఏళ్ళ తరబడి ఊరేగింపుకు నోచుకున్న స్వామి వారి రధం తగలబడి పోయింది. ఆ స్థానంలో నూతన రధం అయితే వచ్చింది గానీ, ఇన్నాళ్ల వరకు నిందితులను పట్టుకోలేకపోవడం ప్రభుత్వ సామర్ధ్యతను సూచిస్తోందా? లేక పోలీస్ వ్యవస్థ చేతులు కట్టేసారా? అన్న అనుమానాలను తావిస్తోంది.

రథానికి ఇన్సూరెన్స్ ఉందిగా ఎందుకంత యాగీ చేస్తున్నారని ఒక మంత్రి., పిచ్చోడు తెలియక రథానికి నిప్పు పెట్టాడని మరొక మంత్రి చెప్పిన నిర్లక్షపు సమాధానాలతో భక్తులు అవాక్కయ్యారు. ఇలా ఒకటికాదు., రెండు కాదు., తిరుపతిలో అన్యమత ప్రచారాలు మొదలు., రామ తీర్ధంలో రాముని విగ్రహ ధ్వంసం., బెజవాడ దుర్గమ్మ రధం చుట్టూ ఉండే వెండి విగ్రహాలు మాయమవ్వడం., ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా చాంతాడవుతుంది.

రాష్ట్రంలో దేవాలయాల మీద., ఆలయాలలో ఉండే విగ్రహాల మీద ఎన్ని దాడులు జరిగినా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించటమే విమర్శలకు తావిస్తోంది. ఇంద్రకీలాద్రి అమ్మ వారి దసరా నవరాత్రి వేడుకలలో అన్యమత ప్రచారాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగింది బీజేపీ పార్టీ. నెల్లూరు బిట్రగుంటలోని ప్రసన్న వేంకటేశ్వరుని ఆలయంలో రధం దగ్ధం., సూర్యారావుపాలెం లక్ష్మి అమ్మ వారి ముఖ ద్వారం కూల్చివేత, పాడేరు., రాజమండ్రి ఇలా రాష్ట్ర మంత ఈ కూల్చివేతల కార్యక్రమాలు కొనసాగుతూనే పోతున్నాయి.

తాజాగా ఇప్పుడు “ఆమోదయోగ్యం కానీ అవమానం” అంటూ బీజేపీ నాయకుడు జీవీఎల్ నరసింహారావు తన సోషల్ మీడియాలో ‘జగన్ మత మార్పిడి ఎజెండా’ను ముందుకు తీసుకు వెళ్తున్నారని ఆరోపించారు. గంగవరంలో రామమందిరాన్ని ఒక పాస్టర్ అక్రమంగా ఆక్రమించి, అందులో ‘క్రెస్తవ ప్రార్ధనలు’ నిర్వహించడం ద్వారా ‘చర్చి’ పరిమితిని దాటింది అంటూ వీడియోని పోస్ట్ చేస్తూ నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఆ వీడియోని చూస్తున్న భక్తులు హిందూ ఆలయంలో హిందూ దేవుళ్ళకు తాళాలేసి క్రెస్తవ మత ప్రార్ధనలు చేయడమేంటి., అధికారులు., స్థానిక నాయకులు చోద్యం చూస్తున్నారా? అంటూ మండిపడుతున్నారు. మతాల మధ్య చిచ్చు పెట్టి తాత్కాలికంగా ‘చలిమంట’ వేసుకోవచ్చు కానీ, దీర్ఘకాలంలో ఆ చలిమంటే కార్చిచ్చయ్యి దహించేస్తుందని తెలుసుకోవాలి.