GVL Narasimha Rao comments on Amaravati Issueఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మూడు రాజధానుల అంశంపై హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ నేడు సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేయడంపై బిజెపి సీనియర్ నేత, ఎంపీ జీవిఎల్ఎన్ రావు స్పందిస్తూ మాట్లాడిన మాటలు బిజెపి ద్వంద వైఖరిని మరోసారి బయటపెట్టాయి. “రాజధాని అంశం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనిది. దానిలో కేంద్రం జోక్యం చేసుకోదు. దానిపై న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి. అయితే ఈ మూడేళ్ళలో జగన్ ప్రభుత్వం రాజధాని కోసం చేసిందేమీ లేదు. కేంద్ర ప్రభుత్వం సహాయసహకారాలు అందించినా గత ప్రభుత్వం కూడా రాజధాని నిర్మాణంలో చాలా జాప్యం చేసింది. ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానం ఎలా నిర్ణయిస్తే అలా చేయవలసిందే,” అని అన్నారు.

బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్ స్పందిస్తూ, “దీనిపై హైకోర్టు తీర్పు చెప్పిన ఆరు నెలల తర్వాత ఇప్పుడు జగన్ ప్రభుత్వం తాపీగా సుప్రీంకోర్టును ఆశ్రయించడం చూస్తే అక్కడా తమకు ఎదురుదెబ్బ తగులుతుందనే అనుమానంతోనే ఇంతకాలం వెనకాడినట్లు భావించవచ్చు. కనుక వైసీపీ ఊహిస్తున్నట్లే హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు తప్పకుండా సమర్ధిస్తుందని నేను నమ్ముతున్నాను. ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఏపీకి రాజధాని నిర్మించలేకపోయిన ఒక అసమర్ధ ముఖ్యమంత్రిగా చరిత్రలో శాస్వితంగా నిలిచిపోతారు,” అని అన్నారు.

బిజెపి నేతలలో ఒకరు ఇది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అంశం అంటుంటే, మరొకరు అమరావతిని నిర్మించకుండా జగన్ తప్పు చేశారన్నట్లు మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా బిజెపి అమరావతికి కాస్త సానుకూలంగా ఎందుకు మాట్లాడుతోందంటే, ఆంధ్రాలో ప్రజలు మెచ్చుకొని అధికారం కట్టబెడతారని కాదు… తెలంగాణలో స్టిరపడిన ఆంధ్రా ఓటర్లను అక్కటుకోవడానికేనని తెలంగాణ బిజెపి ఎంపీ కె.లక్ష్మణ్ ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. ఏపీలో ఇప్పట్లో బిజెపి అధికారంలోకి రాలేదు కానీ తెలంగాణలో వచ్చే అవకాశాలు ఉన్నాయని గట్టిగా నమ్ముతోంది. కనుక తెలంగాణలో స్థిరపడిన ఆంధ్రా ఓటర్లను ఆకటుకోవడానికే ఏపీ బిజెపి నేతలు అమరావతిలో పాదయాత్రలు చేస్తూ హడావుడి చేస్తున్నారు. కనుక అమరావతి విషయంలో వైసీపీలాగే బిజెపికి కూడా ఆసక్తి, చిత్తశుద్ధి లేవని స్పష్టమవుతోంది.