GVL Narasimha Rao -allegations on chandrababu naiduబీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మరోసారి చంద్రబాబు నాయుడుని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఉలవపాడు మండలంలోని రామాయపట్నం పోర్టు ఏరియాను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు నిర్వాకం వల్లే రామాయపట్నం పోర్టు ఆగిందని ఆరోపించారు. రామాయపట్నం ప్రతిపాదనలు పంపకుండా ఐదేళ్లు కాలయాపన చేశారన్నారు. తన సొంత ప్రయోజనాలు నెరవేరకపోవడంతో… రామాయపట్నం, కనిగిరి నిమ్జ్‌ను చంద్రబాబు నిర్లక్ష్యం చేశారన్నారు.

చంద్రబాబు మనుషులు ఇక్కడ భూములు కొనడమే దానికి కారణమని జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. జీవీఎల్ ఆరోపణ కొంచెం విచిత్రంగానే అనిపిస్తుంది. చంద్రబాబు మనుషులు పోర్టు దగ్గర భూములు కొంటే… అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు సహజంగా పోర్టు అభివృద్ధి మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఎందుకంటే అప్పుడే భూముల ధరలు పెరిగి తమ వారికి కలిసి వస్తుంది. కాబట్టి చంద్రబాబు పై జీవీఎల్ చేస్తున్న ఆరోపణలలో పొంతన కుదరడం లేదు.

ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడుని తిట్టి, ఆయన ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికే మోడీ అమిత్ షాలు ఆయనను ఢిల్లీ నుండి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ కు పంపారు. తెలుగుదేశం పార్టీ ఘోర ఓటమిలో ఆయన తన వంతు పాత్ర పోషించారు. అయితే ఓటమి తరువాత కూడా ఆయన చంద్రబాబు మీదే ఫోకస్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీని రాజకీయంగా ఇబ్బంది పెట్టి ప్రతిపక్షంలో స్పేస్ లో బీజేపీని పెట్టాలని వారి తాజా వ్యూహంగా కనిపిస్తుంది.