Guy who harassed lakshmi paravathi joined BJPఎన్నికలకు ముందు దివంగత ఎన్టీఆర్ సతీమణి, వైఎస్సార్ కాంగ్రెస్ నాయకురాలు లక్ష్మీపార్వతి తనను వేధింపులకు గురిచేసిందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి వార్తల్లో నిలిచిన కోటి అనే వ్యక్తి బీజేపీలో చేరాడు. బీ.కోటేశ్వరరావు అలియాస్ కోటి నిన్న విజయవాడలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో బీజేపీలో చేరాడు. కోటి తనపై దుష్ప్రచారం చేసి పరువుకు భంగం కలిగించాడని తెలంగాణ డీజీపీకి లక్ష్మీపార్వతి గతంలో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా ఆమె హై కోర్టును కూడా ఆశ్రయించింది. పోలీసులు నమోదు చేసిన కేసును సిబిఐ లేదా సిఐడి దర్యాప్తునకు ఆదేశించాలని లక్ష్మీపార్వతి హై కోర్టును కోరారు. చంద్రబాబునాయుడు సిఎంగా ఉండగా డిజిపిగా పనిచేసిన ఠాకూర్‌, ఇంటిలిజెన్స్‌ అదనపు డిజిగా చేసిన ఎ.బి.వెంకటేశ్వరరావు, టీవీ 5 మూర్తి, ఎబిఎన్‌ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణల ప్రోత్సాహంతో ఫిర్యాదు చేశారన్నారు. ఈ వ్యాజ్యంలో ఆ నలుగురితోపాటు కోటిని కూడా వ్యక్తిగత హోదాలో ప్రతివాదుల్ని చేశారు.

అధికారిక హోదాలో హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డిజిపి, సిఐడి అదనపు డీజీ, వినుకొండ ఎస్‌హెచ్‌ఓలను ప్రతివాదుల్ని చేశారు. తొందరలోనే ఈ కేసు హియరింగ్ కు రానుంది. ఇలాంటి సందర్భంలో అటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని బీజేపీలో చేర్చుకోవడంపై చర్చ మొదలైంది. ఎన్నికల సమయంలో ఈ కేసు తెర మీదకు రావడంతో వైఎస్సార్ కాంగ్రెస్ లక్ష్మీపార్వతిని ప్రచారం నుండి తప్పించింది. తన చిరకాల ప్రత్యర్థి చంద్రబాబు చిత్తుగా ఓడిపోవడంతో లక్ష్మీపార్వతి చాలా సంతోషంగా ఉన్నారు.