Guntur YSRCP MLAs press meetరాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజమే. అలాగే విమర్శలు, ప్రతివిమర్శలు కూడా! ఒక్కో పార్టీకి ఒక్కో ఎత్తుగడ ఉంటుంది. వైసీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశంలోకి చేరుతున్నారంటూ, ఈ సంఖ్య రెండంకెలకు చేరుకుందని, తాజాగా వెలువడిన వార్తలు తెలిసినవే. అయితే, ఇదంతా తమపై కావాలని చేస్తున్న దుష్ప్రచారమని వైసీపీ నేతలు తిప్పికొట్టారు. కొన్ని మీడియా సంస్థలు చేస్తున్న ఈ ప్రచారంలో వాస్తవం లేదని, జంపింగ్ లంటూ వచ్చిన వారితో ప్రెస్ మీట్ పెట్టించి మరీ ఈ వార్తలను ఖండించారు.

ఏదో టిడిపి ఆడించిన మైండ్ గేమ్ అని కొందరు వైసీపీ నేతలు చాలా తేలికగా తీసుకున్నారు. రాజకీయాల్లో ఇలాంటి ఆటలన్నీ సహజం కాబట్టి వీటికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. అయితే వైసీపీ నేతలు ఇక్కడితో ఆగిపోతే, తమ ప్రభావం ఉండదనుకున్నారో ఏమో గానీ, గుంటూరు జిల్లా వైకాపా ఎమ్మెల్యేలు రామకృష్ణారెడ్డి, ముస్తఫా, కోన రఘుపతి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు మీడియాలో మాట్లాడుతూ… ఒక అద్భుతమైన హాస్యాస్పద ప్రకటన చేసారు. ఈ ప్రకటన విన్న తర్వాత ‘ఆశ్చర్యంతో కూడిన హాస్యం’ రావడం సహజమే మరి!

“తెలుగుదేశం పార్టీ నేతలు మాతో టచ్ లో ఉన్నారని, ఏ క్షణమైనా వారంతా వైసీపీలోకి రావచ్చని, తెలుగుదేశం మునిగిపోయే నావ అని, ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు సంప్రదింపులు జరిపారని” తెలుగుదేశం పార్టీకి కౌంటర్ ఇచ్చే పనిలో “జోకులు” వేసారని నెటిజన్లు నవ్వుకుంటున్నారు. రాజకీయంగా ఎన్ని విమర్శలు అయినా చేసుకోవచ్చు గానీ, అధికారం చేతిలో ఉంచుకుని రాజకీయ నేతలు ప్రతిపక్షంలోకి వెళ్ళాలని చెప్పడం హాస్యాస్పదం కాక ఇంకేంటి..? అంటున్నారు. నిజానికి అలాంటి అరుదైన సంఘటనలు ఏ నూటికో, కోటికో జరుగుతుంటాయి. ప్రస్తుతం వైసీపీ ఉన్న పరిస్థితులలో అయితే జరిగే అవకాశం లేదని అందరికీ తెలిసిందే.

టిడిపి మైండ్ గేమ్ ఆడుతోందని ప్రస్తావించిన వైసీపీ నేతలు, దాన్ని పునరావృతం చేయాలని పడే తాపత్రయంలో భాగంగానే ఇలాంటి ప్రకటనలు వచ్చాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు ‘మైండ్’ గేమ్ ఆడుతున్నట్టే ఉన్నాయా? లేక ఇలాంటి వారు పార్టీలో ఉంటే ప్రత్యర్ధులు ‘మైండ్’ గేమ్ ఆడుతూనే ఉంటారని భావించాలా? ఇప్పటికీ విజ్ఞులకు అర్ధమై ఉంటుంది..!