guntur-people-protest-before-ap-ministers-Botsa Satyanarayana -Mopidevi Venkataramanaఆంధ్రప్రదేశ్ లో ఇసుక కొరత తీవ్రం అవుతుంది. ఇసుక కొరతతో నిర్మాణ రంగం పూర్తిగా కుదేలయ్యింది. దీనితో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి భావన నిర్మాణ కార్మికులు పనులు లేక పస్తులుండాల్సిన పరిస్థితి. ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ విషయంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం మొదలు పెట్టాయి.

నిన్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేసింది. వచ్చే నెల 3,4 తారీఖులలో జనసేన కూడా విశాఖపట్నంలో ఒక నిరసన కవాతుకు పిలుపునిచ్చింది. మరోవైపు ఈరోజు గుంటూరు నగరంలో పర్యటించిన రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణకు చేదు అనుభవం ఎదురైంది.

ఇసుక అందుబాటులో లేక పనులు నిలిచిపోవడంతో ఆగ్రహోదగ్రులుగా ఉన్న భవన నిర్మాణ కార్మికులు నగరానికి వచ్చిన బొత్సను అడ్డుకుని నిలదీశారు. ప్రభుత్వ విధానం వల్ల పనుల్లేక అర్ధాకలితో బతుకుతున్నామని, మీకు ఓట్లేసి గెలిపించినందుకు మాకు చేసిన మేలు ఇదేనా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే వారిని సమాధాన పరచలేక మంత్రి ఏమీ మాట్లాడకుండా కారెక్కి వెళ్లిపోయారు. బొత్స వెంట మరో మంత్రి మోపిదేవి వెంకటరమణ, స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడిన బొత్స ఆ విషయం ప్రస్తావించడానికి కూడా ఇష్టపడలేదు. భూగర్భ డ్రైనేజ్ పనులు ఆగిపోవడానికి, రోడ్లు పాడైపోవడానికి గత ప్రభుత్వం కారణం అంటూ విమర్శలు చేసి వెళ్లిపోయారు.