Gummanur Jayaram MLAజగన్ కేబినెట్ లో లేబర్ మంత్రి గుమ్మనూరు జయరామ్ ఈ మధ్య కాలంలో వరుసగా వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు. బినామీ పేరుతో తన కుమారుడికి ఈఎస్ఐ స్కాం లోని నిందితుడితో బెంజ్ కార్ కొనిపించుకున్నారు మంత్రిగారు. అది మా కారు కాదు ఎవరో కారు మా అబ్బాయి చేతి నుండి ఇప్పించుకున్నారు అని చెప్పుకొచ్చారు మంత్రి గారు.

అయితే సదరు మంత్రి కుమారుడి సోషల్ మీడియాలో తరచు పెట్టే ఫోటోలు, వీడియోలను బట్టి మంత్రి గారి వివరణను నమ్మేవారు లేకుండా పోయారు. తాజాగా మరో వివాదంలో ఇరుక్కున్నారు ఆయన ఒక మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో తాను మంత్రి అయ్యాకా కేవలం 100 ఎకరాలు కొనుగోలు చేశా అని ఒప్పుకున్నారు మంత్రి గారు.

అయితే 2019లోని ఆయన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆయన వార్షిక ఆదాయం కేవలం మూడు లక్షలు మాత్రమే. అదే అఫిడవిట్ లో మిగతా కుటుంబసభ్యులకు ఎటువంటి ఆదాయం లేదు. భార్యకు కనీసం పాన్ కార్డ్ కూడా లేదు అని చెప్పారు. బ్యాంకు ఖాతాలలో పది లక్షల బ్యాలన్స్ చూపించారు. తనకు కేవలం 8.19 ఎకరాల భూమి ఉందని చెప్పుకొచ్చారు.

అది కూడా వారసత్వంగా వచ్చిన భూమి అని చూపించారు. అంటే ఎన్నికల తరువాత 100 ఎకరాలు ఎలా కొన్నారు? అంటే అదంతా ఎన్నికల తరువాత మంత్రి అయ్యాకనే సంపాదించిన సొమ్ము. అయితే ఒక మంత్రిగా వచ్చే జీతంతో 100 ఎకరాలు కొనే పరిస్థితి లేదు. అంటే అవినీతికి పాల్పడినట్టే కదా? అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.