Gulabo Sitabo - 35 cores dealసినిమా ఇండస్ట్రీ పైన లాక్ డౌన్ ఎఫెక్ట్ బాగా పడింది. సినిమా షూటింగ్ లన్ని ఎక్కడివక్కడే ఆగిపోయాయి. విడుదలకు సింద్దమైన సినిమాలన్ని ల్యాబుల్లో చిక్కుకున్నాయి. షూటింగ్స్ లేక సెలబ్రెటీలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ఎత్తేసిన సినిమా థియేటర్స్ తెరుచుకునే పరిస్థితి లేదు.

దీనితో చాలా మంది నిర్మాతలు… థియేటర్ల విడుదలను కాదని, డైరెక్టుగా ఆన్ లైన్ లో తమ సినిమాలు విడుదల చేస్తున్నారు. అలా ప్రకటింపబడిన మొట్టమొదటి పెద్ద చిత్రం…. అమితాబ్ బచ్చన్ ఆయుష్మాన్ ఖుర్రానా నటించిన ‘గులాబో సీతాబో’. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో వచ్చే నెల 20న విడుదల కాబోతుంది.

ఈ సినిమా గత నెల 17న థియేటర్లలో రావాల్సి ఉండగా.. లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. స్ట్రీమింగ్ హక్కుల కోసం నిర్మాతలు మొదట్లో 70-75 కోట్లు డిమాండ్ చేశారు, అయితే అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ ఒప్పందాన్ని 35 కోట్లకు ముగించగలిగింది. గులాబో సీతాబో బాటలో ఇప్పటివరకు దాదాపుగా డజన్ సినిమాలు డైరెక్టుగా ఆన్ లైన్ లో విడుదల అవుతున్నట్టు ప్రకటించాయి.

తెలుగులో ఇప్పటివరకు అమృతారామం అనే చిన్న సినిమా మాత్రమే డైరెక్టుగా ఆన్ లైన్ లో విడుదల అయ్యింది. ఇప్పటివరకు చెప్పుకోదగిన సినిమాలు ఏమీ ఆ దిశగా ప్రకటన చెయ్యలేదు. అయితే అనుష్క నిశ్శబ్దం సినిమా నిర్మాతలు మాత్రం అమెజాన్ ప్రైమ్ తో చర్చలు జరుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.