Gujarat Lions Vs Royal Challengers Bangalore IPL 2017ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 10లో భాగంగా జరిగిన తాజా మ్యాచ్ లో గుజరాత్ లయన్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు ఘన విజయం సాధించింది. రెండు జట్లు తప్పక గెలిచి తీరాల్సిన మ్యాచ్ గా మారిన తరుణంలో, చివరకు బెంగుళూరు పైచేయి సాధించింది. గేల్ విధ్వంసంతో ఆర్సీబీ ఇచ్చిన భారీ లక్ష్యాన్ని అందుకోవడంలో గుజరాత్ విఫలమైంది. అయితే కాస్త పోరాటపటిమను ప్రదర్శించి నెట్ రన్ రేట్ విభాగంలో పెద్ద తేడా లేకుండా జాగ్రత్తపడింది.

గతేడాది ఐపీఎల్ లోకి ప్రవేశించిన గుజరాత్ లయన్స్ జట్టుది విచిత్రమైన పరిస్థితి. ఈ సీజన్ లో ఇప్పటివరకు 5 మ్యాచ్ లు ఆడగా, కేవలం ఒక్క మ్యాచ్ లో మాత్రమే విజయం సాధించి, నాలుగు మ్యాచ్ లలో ఓటమిని చవిచూసి, పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో నిలిచారు. అయితే గతేడాది గుజరాత్ ప్రదర్శన చూసిన వారికి ఈ ఏడాది ఆటతీరు పూర్తి నిరుత్సాహానికి గురి చేస్తోంది. గత సీజన్లో ముందుగా ప్లే ఆఫ్స్ కు అర్హత పొందిన జట్టుగా గుజరాత్ కు మంచి ట్రాక్ రికార్డు ఉంది.

అలాగే 14 మ్యాచ్ లు ముగిసే సమయానికి కూడా గుజరాత్ నెంబర్ 1 స్థానంలో నిలిచింది. రైనా సారధ్యంలో కొత్తగా ఏర్పాటైన జట్టు అమోఘం అంటూ క్రీడా పండితుల చేత కితాబునందుకున్న జట్టు, ఈ ఏడాది వచ్చేసరికి ‘బాటమ్’లో నిలిచి ఆశ్చర్యపరిచింది. ఇంకా మ్యాచ్ లు మిగిలి ఉన్నప్పటికీ, ఇక్కడ నుండి రైనా జట్టు ప్లే ఆఫ్స్ కు అర్హత పొందాలంటే, ఆడిన ప్రతి మ్యాచ్ లోనూ విజయం సాధించాల్సి ఉంటుంది. ప్రస్తుతం గుజరాత్ ప్రదర్శన చూస్తున్న వారికి ఇది అనితర సాధ్యమనే చెప్తున్నారు.