Gujarat Lions vs Mumbai Indians Jasprit Bumrah super overనరాలు తెగే ఉత్కంఠ నడుమ ముంబై ఇండియన్స్ – గుజరాత్ లయన్స్ జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్ ముగిసింది. ఈ సీజన్ లో ఫస్ట్ ‘సూపర్ ఓవర్’ అందించిన ఈ మ్యాచ్ లో… చివరకు ముంబై ఇండియన్స్ జయకేతనం ఎగురవేసింది. ముంబై తరపున ‘సూపర్ ఓవర్’ వేసిన ‘సూపర్ బౌలర్’ బూమ్రాకు జట్టు సభ్యులతో పాటు క్రీడా పండితులు జయహారతి పడుతున్నారు. నిజానికి అతి తేలికగా గెలవాల్సిన మ్యాచ్ లో నిర్లక్ష్యంగా వికెట్లను పారేసుకుని మ్యాచ్ ను ‘టై’ వరకు తెచ్చుకుంది ముంబై ఇండియన్స్.

టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న గుజరాత్ జట్టు అదిరిపోయే ఆరంభాన్ని అందుకుంది. తొలి 4 ఓవర్లలోనే 40కి పైగా పరుగులు చేసి భారీ స్కోర్ దిశగా పయనిస్తోన్న గుజరాత్ జట్టు, ఆ తర్వాత వరుసగా రైనా, ఫించ్, కార్తీక్, కిషన్, జడేజా, పటాన్ వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే చివర్లో ఫాల్కనర్, టైలు తమ బ్యాటింగ్ ప్రతిభ కూడా చూపడంతో గౌరవప్రదమైన 153 పరుగులకు చేరుకోగలిగింది. బ్యాటింగ్ విభాగంలో ఓపెనర్ ఇషాన్ కిషన్ 48 పరుగులతో జట్టు టాప్ స్కోరర్ గా నిలిచాడు.

ఇక లక్ష్య చేదనను ముంబై కూడా గ్రాండ్ గా ఆరంభించింది. ముఖ్యంగా ఓపెనర్ పార్థీవ్ పటేల్ 44 బంతుల్లో 70 పరుగులు చేయడంతో అతి తేలికగా మ్యాచ్ ను సొంతం చేసుకుంటుందని అంతా భావించారు. అయితే చివరి పది ఓవర్లలో చేతిలో 8 వికెట్లు ఉంచుకుని, కేవలం 68 పరుగులు మాత్రమే చేయాల్సి ఉంది. ఈ సమయంలోనే లేనిపోని భారీ షాట్లకు ప్రయత్నించి ముంబై బ్యాట్స్ మెన్లు వరుసగా పెవిలియన్ బాట పట్టారు. చివరి బంతి వరకు నిలిచిన కృనాల్ పాండ్య, ముంబై కనీసం టై చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.

చివరి ఓవర్ లో 11 పరుగులు కావాల్సిన సమయంలో మొదటి బంతినే సిక్సర్ గా మలిచి, చివరి 5 బంతుల్లో 4 పరుగులు మాత్రమే చేసి చివరి బంతికి రనౌట్ కావడంతో మ్యాచ్ ‘టై’గా ముగిసింది. ఇక సూపర్ ఓవర్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై కేవలం 5 బంతులనే ఎదుర్కొని 2 వికెట్లు కోల్పోయి 11 పరుగులు చేసింది. దీంతో గుజరాత్ విజయం ఖాయమని అంతా భావించారు. ఒక ఓవర్లో 12 పరుగులు చేయాల్సి ఉండగా, బరిలోకి అరవీర భయంకర హిట్టర్లు ఫించ్, మెక్కల్లంలు దిగారు.

మరో రోహిత్ శర్మ బంతిని బూమ్రాకు అందించాడు. తొలి బంతినే ‘నో’ బాల్ వేయడంతో, ఇక మ్యాచ్ పై ముంబై ఇండియన్స్ అభిమానులు ఆశలు వదులుకున్నారు. అయితే రెండవ బంతిని యార్కర్ వేయడంతో అది సింగిల్ కే పరిమితం అయ్యింది. అలాగే మూడవ బంతిని ‘వైడ్’ బాల్ వేయడంతో కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర నిరుత్సాహం వ్యక్తపరిచాడు. అయితే ఆ మిగిలి ఉన్న బంతులను స్లో బాల్స్, యార్కర్లుగా సంధించడంతో ఒక్క బంతిని కూడా బౌండరీకి తరలించలేక, బూమ్రా వేసిన 8 బంతుల్లో కేవలం 6 పరుగులు మాత్రమే చేయగలిగారు.

అత్యంత చాకచక్యంగా వేసిన బూమ్రా ఓవర్ ముంబై ఇండియన్స్ కు విజయాన్ని తెచ్చిపెట్టింది. దీంతో ఆడిన 9 మ్యాచ్ లలో 7 విజయాలను సాధించి 14 పాయింట్లతో రెండవ స్థానంలో నిలిచింది. మరో వైపు గుజరాత్ 9 మ్యాచ్ లలో 3 విజయాలను అందుకుని కేవలం 6 పాయింట్లను మాత్రమే అందుకోవడంతో, మిగిలి ఉన్న 5 మ్యాచ్ లలో గుజరాత్ గెలిస్తే తప్ప ‘ప్లే ఆఫ్స్’కు క్వాలిఫై అయ్యే అవకాశం లేదు. ఏ ఒక్క మ్యాచ్ లో ఓడిపోయినా… రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టుతో పాటు వెనక్కి వెళ్ళిపోవడం ఖాయం.