gujarat Lions Vs Hyderabad Sunrisers IPL 10ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో 7వ స్థానంలో గుజరాత్ జట్టులోని ఇద్దరు ఆటగాళ్ళు మ్యాచ్ ఫిక్సింగ్ చేసారన్న ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఆరోపణలు తలెత్తి మరో 24 గంటలు కూడా గడవక ముందే, గుజరాత్ లయన్స్ జట్టు కీలకమైన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తో తలపడింది. గుజరాత్ కు ఈ మ్యాచ్ గెలిచినా, ఓడినా పెద్దగా ప్రయోజనం ఉండదు గానీ, ప్లే ఆఫ్స్ కు చేరుకోవాలంటే హైదరాబాద్ మాత్రం తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది.

ఈ తరుణంలో తొలుత బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ జట్టు, హైదరాబాద్ కు గట్టి షాక్ ఇచ్చే విధంగా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది. ఓపెనర్లు డ్వేన్ స్మిత్ 33 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 54 పరుగులు చేయగా, మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ 40 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 61 పరుగులు చేసాడు. దీంతో తొలి వికెట్ కు కేవలం 10.5 ఓవర్లలో 111 పరుగుల భారీ భాగస్వామ్యం ఏర్పడింది. తొలి వికెట్ గా వెనుదిరిగిన స్మిత్ తర్వాత అసలు ట్విస్ట్ ప్రారంభమైంది. అప్పటివరకు ఓ ప్లానింగ్ తో ఆడిన గుజరాత్ బ్యాట్స్ మెన్లు ఎందుకు ఆడుతున్నారో, ఎవరి కోసం ఆడుతున్నారో తెలియనట్లుగా షాట్లు కొడుతూ ఒకరి వెనుక ఒకరు పెవిలియన్ చేరుకున్నారు.

ఓపెనింగ్ భాగస్వామ్యం చూసిన తర్వాత గుజరాత్ ఖచ్చితంగా 200 పరుగులకు చేరుకుంటుందని భావిస్తే… చివరికి ముక్కిమూలిగి 154 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. అసలు విశేషమేమిటంటే… ఇందులో బౌలర్లు గొప్పతనం కన్నా, బ్యాట్స్ మెన్లు తమకు తాముగా అవుటవ్వుతూ పెవిలియన్ కు చేరుకుంటున్నట్లుగా కనపడింది. బహుశా ఇంకా ఎక్కువ స్కోర్ సాధిస్తే హైదరాబాద్ చేధించలేదని భావించారో ఏమో గానీ, డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్ళడానికి పోటీలు పడ్డారు.

సాధారణంగా ఒక ఓవర్ లో వికెట్ పడితే, తదుపరి వచ్చే బ్యాట్స్ మెన్లు కాస్త నిదానంగా చూసి ఆడుతుంటారు. కానీ ఈ మ్యాచ్ మాత్రం అందుకు విరుద్ధం. ఒక ఓవర్ లో వికెట్ పట్టడం పక్కన పెడితే, 10 బంతుల్లో 4 వికెట్లు కోల్పోయినా గానీ, అదే బాధ్యతారాహిత్యపు షాట్లు ఆడుతూ హైదరాబాద్ విజయాన్ని సులభతరం చేసారు. సాధారణంగా క్రికెట్ చూసే ప్రేక్షకులకు ‘మ్యాచ్ ఫిక్సింగ్’ అన్నది గుర్తుకు రాదు, కానీ ఇలాంటి ఇన్నింగ్స్ లు చూసిన తర్వాత క్రికెట్ అభిమానులకు మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై బలం చేకూరుతాయి.